జీ7కు కాలం చెల్లింది.. ఇండియాను చేర్చుకోవడం బెటర్: ట్రంప్

జీ7కు కాలం చెల్లింది.. ఇండియాను చేర్చుకోవడం బెటర్: ట్రంప్
  • మరో మూడు దేశాలను ఇన్వైట్ చేయనున్నట్లు వెల్లడి
  • సెప్టెంబర్ వరకు సమ్మిట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

వాషింగ్టన్: ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) సమ్మిట్ ను ఈ ఏడాది సెప్టెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సమ్మిట్​లో ఇండియాతో పాటు మరికొన్ని దేశాలను చేర్చాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ వెళ్తున్న ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్​లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్ వరకు సమ్మిట్ ను వాయిదా వేస్తున్నా. ఇండియాతో పాటు రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను ఆహ్వానించాలని యోచిస్తున్నా”అని అన్నారు. జీ7 సభ్యదేశాలు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులను రిప్రెజెంట్ చేస్తాయని తాను అనుకోవడంల లేదని, అదొక ఔట్​డేటెడ్ గ్రూప్‌ ఆఫ్ కంట్రీస్ అని అన్నారు.
భవిష్యత్తులో చైనాను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై తమకు మద్దతుగా ఉన్న మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని వైట్​హౌస్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలిస్సా అలెగ్జాండ్రా ఫరా అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాల ఫోరమ్ జీ7. – ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా దేశాల అధిపతులు ఇంటర్నేషనల్ ఎకనామిక్, మానిటరీ ఇష్యూలపై ఏటా సమావేశమవుతారు. ఈ ఏడాది మార్చిలో జరగాల్సి జీ 7 శిఖరాగ్ర సమావేశం కరోనా ఎఫెక్టుతో జూన్ కు వాయిదా పడింది. ప్రపంచం అంతటా వైరస్ విస్తరించిన నేపథ్యంలో చాలా దేశాలు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జీ 7 సదస్సును నేరుగా నిర్వహించాలి ట్రంప్ భావించారు. కానీ, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అందుకు నిరాకరించారు.