- తాము తొందరపడట్లేదని, మళ్లీ దాడులకు ఆత్రుత ఏమీ లేదని కామెంట్
- ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడాన్ని స్వాగతించిన యూఎస్ ప్రెసిడెంట్
వాషింగ్టన్: ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరే వరకు ఆ దేశ పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా, -ఇరాన్ చర్చలు ముందుకు సాగాలంటే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు.
బుధవారం 'యాక్సియోస్' వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. "బాంబు దాడుల కంటే ఈ దిగ్బంధం చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిస్థితి వారికి ఇంకా దారుణంగా మారబోతోంది. వారిని అణు ఆయుధాన్ని తయారుచేయనివ్వం" అని ట్రంప్ తేల్చిచెప్పారు. చర్చలకు రావాలంటే ముందుగా దిగ్బంధాన్ని ఎత్తివేయాలని ఇరాన్ షరతు పెట్టింది. హార్మూజ్ జలసంధిపై తాము విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేస్తామని, ప్రతిగా తమ ఓడరేవులపై దిగ్బంధం తొలగించాలని ఇరాన్ ఇదివరకే ఒక పరిమిత ఒప్పందాన్ని ప్రతిపాదించగా.. ట్రంప్ ఆ ప్రపోజల్ ను తిరస్కరించినట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితి పట్ల తానేమీ తొందరపడటం లేదని, సమగ్ర ఒప్పందం కోసం లేదా తిరిగి యుద్ధానికి వెళ్లడం కోసం ఆత్రుతగా లేనని అన్నారు. ‘‘ఇరాన్ సైనిక సామర్థ్యాలను అమెరికా తీవ్రంగా దెబ్బతీసింది. వారి దగ్గర ఇప్పుడు చాలా తక్కువ ఆయుధ నిల్వలు మిగిలి ఉన్నాయి. మిసైల్స్ అతికొద్దిగా మాత్రమే ఉన్నాయి" అని ట్రంప్ చెప్పారు.
- యూఏఈ అధ్యక్షుడు తెలివైనవారు..
చమురు ఉత్పత్తి దేశాల కూటమి (ఒపెక్) నుంచి తప్పుకుంటున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రకటించడాన్ని ట్రంప్ స్వాగతించారు. "ఇది గొప్ప విషయం" అని వ్యాఖ్యానించారు. యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చాలా తెలివైన వారని, ఆయన తన సొంత మార్గంలో వెళ్లాలని భావించి ఉండవచ్చన్నారు. ఇది అంతిమంగా గ్యాస్, చమురు సహా అన్ని వస్తువుల ధరలు తగ్గడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దిగ్బంధంలో భాగంగా ఇరాన్‌కు చెందిన రెండు వాణిజ్య నౌకలను అమెరికా స్వాధీనం చేసుకుంది. గత కొద్ది వారాల్లో ప్రాంతీయ జలాల్లో 39 నౌకలను దారి మళ్లించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. దీనికి ప్రతిస్పందనగా, సముద్ర నియమాలను ఉల్లంఘించాయనే ఆరోపణలతో ఇరాన్ కూడా కొన్ని నౌకలను అదుపులోకి తీసుకుంది. దీంతో హార్మూజ్ లో ఈ ప్రతిష్టంభన కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.

