- ఓ షిప్పుపై దిగి.. అందులోని సరుకులు స్వాధీనం చేసుకున్నం
- మాకు ఇది లాభసాటి వ్యాపారం
- పిచ్చివాళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు.. చర్చలు విఫలమైతే వారిని పేల్చేస్తామంటూ కామెంట్
వాషింగ్టన్: ఇరాన్ పోర్టుల దిగ్బంధాన్ని కొనసాగించడానికి తాము సముద్రపు దొంగల(పైరేట్లు) మాదిరిగా వ్యవహరిస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘అమెరికా నావికాదళం సైనికులు హెలికాప్టర్ ద్వారా ఓ షిప్పుపై ల్యాండ్ అయ్యారు. ఆ షిప్పుతోపాటు అందులోని సరుకులను, చమురును స్వాధీనం చేసుకున్నారు.
హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న ఈ నౌకాదళ దిగ్బంధం చాలా లాభదాయకమైన వ్యాపారం”అని ఆయన కామెంట్ చేశారు. షిప్పులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను వివరిస్తూ.. అమెరికా నావికాదళ సిబ్బంది పైరేట్లలా వ్యవహరిస్తున్నారని శుక్రవారం ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన చెప్పుకొచ్చారు. ‘‘మేం సముద్రపు దొంగలవంటి వాళ్లం. కానీ మేం ఆటలు ఆడటం లేదు” అని ట్రంప్ కామెంట్ చేయగా, అక్కడి జనం నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.
కాగా, యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనపై తనకు "సంతృప్తి లేదు" అని ట్రంప్ చెప్పారు. తాను అంగీకరించలేని రాయితీలను ఇరాన్ కోరుతోందని ట్రంప్ చెప్పారు. ‘‘ఒప్పందం కుదురుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ చర్చలు విఫలమైతే వారిని పేల్చివేస్తాం’’ అని హెచ్చరించారు. ఇరాన్‌తో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించాల్సిన అవసరం రావచ్చని ట్రంప్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల వివరాలు కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసని అన్నారు.
పిచ్చివాళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండొద్దనే..
పిచ్చివాళ్ల దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని.. అందుకే ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేస్తోందని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై అమెరికా చర్య పశ్చిమాసియాను అణు సామర్థ్యం కలిగిన ఇరాన్ నుంచి కాపాడిందని చెప్పారు. ‘మేం బీ2 బాంబర్లతో వారిని (ఇరాన్‌ను) అడ్డుకున్నాం. మేం అలా చేయకపోతే, వారి దగ్గర అణ్వాయుధం ఉండేది. ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్ ముక్కలైపోయేవి’ అని ఆయన అన్నారు. ‘ఇరాన్ దగ్గర ప్రస్తుతం నౌకాదళం లేదు. వైమానిక దళం లేదు. విమానాలపై దాడి చేసే పరికరాలు లేవు. రాడార్ లేదు. వారి నాయకులందరూ పోయారు’ అని వ్యాఖ్యానించారు.
అయితే, యుద్ధం అకాలంగా ముగియదన్నారు. ‘మేం త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోయి, మరో మూడు ఏళ్లలో ఇలాంటి సమస్య తలెత్తేలా చేయం’ అని అన్నారు. ఇరాన్ నాయకత్వం విచ్ఛిన్నమైందని, అది రెండు లేదా మూడు గ్రూపులుగా విడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాలన అస్తవ్యస్తమై, ఎవరి చేతిలో ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ‘వారందరికీ ఒప్పందం చేసుకోవాలని ఉంది. కానీ ఎవరు ముందుకు రావాలో తెలియక గందరగోళంలో ఉన్నారు’ అని పేర్కొన్నారు.
తిరిగొచ్చే దారిలో క్యూబాను ఆక్రమిస్తాం..
ఇరాన్ యుద్ధం ముగించి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాను స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. "క్యూబా సమస్యల్లో చిక్కుంది" అని పామ్ బీచ్‌లోని ఫోరమ్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన అన్నారు.
"ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో, ప్రపంచంలోనే అతిపెద్దదైన మా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను తీరానికి సుమారు 100 గజాల దూరంలో ఆపుతాం. అప్పుడు వారు 'చాలా ధన్యవాదాలు. మేం లొంగిపోతున్నాం' అని అంటారు" అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే తన యుద్ధ ముగింపు వ్యూహం అని అభివర్ణించారు.
హార్మూజ్ టోల్ చెల్లింపుదారులపై ఆంక్షలు
హార్మూజ్ జలసంధి గుండా తమ నౌకలు వెళ్లడం కోసం ఇరాన్‌కు టోల్ చెల్లించే సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ నియంత్రణలో ఉండే కొత్త ‘మారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్’ను విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం వల్ల 45 ఓడలు ఆగిపోయాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
‘అమెరికా దళాలు అంతర్జాతీయ జలాల్లో గస్తీని కొనసాగిస్తున్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు 45 వాణిజ్య నౌకలను వెనక్కి తిరిగిపోవాలని లేదా ఓడరేవుకు తిరిగి వెళ్లాలని ఆదేశించాం’ అని సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’లో పేర్కొంది.
