టాక్ షో హోస్ట్‌పై ట్రంప్ పగ.. హోస్టును డస్ట్‌బిన్‌లో పడేసి డాన్స్ చేస్తున్న ఏఐ వీడియో పోస్ట్

టాక్ షో హోస్ట్‌పై ట్రంప్ పగ.. హోస్టును డస్ట్‌బిన్‌లో పడేసి డాన్స్ చేస్తున్న ఏఐ వీడియో పోస్ట్

అమెరికా బుల్లితెరపై దశాబ్ద కాలంగా నవ్వులు పూయించిన ప్రముఖ టాక్ షో 'ది లేట్ షో' ప్రస్థానం ముగిసింది. అయితే ఈ షో ముగింపు కంటే కూడా.. దీని హోస్ట్ స్టీఫెన్ కోల్బర్ట్‌ను టార్గెట్ చేసుకుని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఏఐ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ట్రంప్ తన ఎక్స్, ట్రూత్ సోషల్ ఖాతాల్లో ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ట్రంప్ స్వయంగా కోల్బర్ట్‌ను చేతులతో ఎత్తి, షో సెట్‌పైనే ఉన్న ఒక డస్ట్‌బిన్‌లో పడేసినట్లు ఉంది. ఆ వెంటనే ట్రంప్ YMCA సాంగ్‌కు డ్యాన్స్ చేస్తుండగా, జనం కేరింతలు కొడుతున్నట్లు ఎడిట్ చేశారు ఆ వీడియోను.

ఎటువంటి క్యాప్షన్ లేకుండా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ట్రంప్ సపోర్టర్స్ దీనిని ఆయన సిగ్నేచర్ స్టైల్ అంటూ మెచ్చుకుంటుంటే.. విమర్శకులు మాత్రం ఇదొక అధికార దుర్వినియోగం అంటూ మండిపడుతున్నారు. ఇది నిజమైన అకౌంటేనా అని తాను డబుల్ చెక్ చేసుకున్నానంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

నిజానికి కోల్బర్ట్ షో రద్దు కావడం వెనుక తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతేడాది పారామౌంట్ సంస్థ ట్రంప్‌తో చేసుకున్న ఒక లీగల్ సెటిల్‌మెంట్ వల్లే ఈ షోను ఆపేశారని కోల్బర్ట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీనికి బలం చేకూరుస్తూ.. షో రద్దుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

"సిబిఎస్ ఛానల్‌లో కోల్బర్ట్ చాప్టర్ క్లోజ్ అయింది. అసలు ఇన్నాళ్లు ఎలా కొనసాగాడో? అతనికి టాలెంట్ లేదు, రేటింగ్స్ లేవు. రోడ్డు మీద వెళ్లే ఎవరిని తెచ్చినా అతనికంటే బాగా చేస్తారు. శని వదిలింది" అంటూ ట్రంప్ ఘాటుగా పోస్ట్ పెట్టారు. 

గతంలోనే కోల్బర్ట్ ఫైరింగ్‌ను స్వాగతించిన ట్రంప్.. జిమ్మీ కిమ్మెల్, జిమ్మీ ఫాలోన్‌లను కూడా టార్గెట్ చేశారు. గ్రెగ్ గట్‌ఫెల్డ్ అందరికంటే బెటర్ అంటూ ప్రశంసించారు. మొత్తానికి ట్రంప్, కోల్బర్ట్ మధ్య ఉన్న పాత పగ.. ఈ ఏఐ వీడియోతో మరోసారి ప్రపంచం ముందుకు వచ్చింది. మెుత్తానికి ఒక కమీడియన్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మనిషి అమెరికా ప్రెసిడెంట్ సిల్లీ చేష్టలు ఆయన హోదాకు అస్సలు తగవంటూ నెటిజన్లు ట్రంప్ కి చురకలువేస్తున్నారు.