భారత సోలార్ ఇంపోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై 126శాతం టారిఫ్.. ట్రంప్ నిర్ణయం

భారత సోలార్ ఇంపోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై 126శాతం టారిఫ్.. ట్రంప్ నిర్ణయం

న్యూఢిల్లీ: భారత సోలార్ ఇండస్ట్రీకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ షాక్ ఇచ్చారు. భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే సోలార్ ఉత్పత్తులపై 126% ప్రైమరీ టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం మన దేశంలోని సోలార్ ఎగుమతి కంపెనీలపై పెను ప్రభావం చూపనుంది. 

భారత్ తోపాటు ఇండోనేసియా, లావోస్ దేశాలు సోలార్ తయారీ రంగానికి అడ్డగోలుగా సబ్సిడీలు ఇస్తున్నాయని.. దీనివల్ల తమ దేశంలోని కంపెనీలు నష్టపోతున్నాయని అమెరికా వాణిజ్య శాఖ తెలిపింది. అందుకే భారత సోలార్ ఇంపోర్ట్స్ పై 126% పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే, ఇండోనేసియాపై ప్రైమరీ టారిఫ్స్ ను 86 శాతం నుంచి 143 శాతానికి పెంచుతున్నట్లు.. లావోస్‌‌‌‌‌‌‌‌పై 81 శాతం డ్యూటీ వేస్తున్నట్లు పేర్కొంది.

 ఈ మూడు దేశాల్లో పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాల వల్ల సోలార్ ఎగుమతిదారులు పొందుతున్న అన్యాయ లాభాలను సమతుల్యం చేయడమే ఈ చర్యల లక్ష్యమని సమర్థించుకుంది. 126 శాతం టారిఫ్ అంటే భారత సోలార్ తయారీదారులకు అమెరికా మార్కెట్ దాదాపు మూసుకుపోయినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇంత భారీ పన్ను చెల్లించి అక్కడ పోటీ పడటం అసాధ్యమంటున్నారు. ఈ నెల మొదట్లోనే భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. సోలార్ ఉత్పత్తులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య ఆర్థిక ఉద్రిక్తతలను మళ్లీ పెంచింది.