భారత్ తో ట్రేడ్ డీల్ కు ట్రంప్ ఓకే.. 25 నుంచి 18 శాతానికి తగ్గింపు

భారత్ తో  ట్రేడ్ డీల్ కు ట్రంప్ ఓకే.. 25 నుంచి 18 శాతానికి తగ్గింపు
  • రష్యా ఆయిల్  కొనుగోలును ఆపివేస్తామని ఇండియా ఒప్పుకుంది
  • తమ వద్దే వెనెజువెలా చమురు కొంటుందని వెల్లడి
  • ట్రంప్​కు 140 కోట్ల భారతీయుల తరపున బిగ్ థ్యాంక్స్: మోదీ
  • ప్రపంచ శాంతి,  సుస్థిరత కోసం కలిసి పనిచేస్తామని కామెంట్

వాషింగ్టన్: భారత్​తో ట్రేడ్  డీల్​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  ఒప్పుకున్నారు. ఇండియాపై ప్రస్తుతం ఉన్న రెసిప్రోకల్  టారిఫ్​లను 25 నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్  తన ట్రూత్ సోషల్​లో పోస్టు చేశారు. ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న స్నేహం, ఆయనపై ఉన్న గౌరవం కారణంగా ఇండియాతో ట్రేడ్ డీల్​కు మేం ఒప్పుకున్నాం. అందుకోసం మోదీ నాకు రిక్వెస్ట్  చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాపై రెసిప్రోకల్  టారిఫ్​లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాం. అలాగే, రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేయడానికి భారత్  ఒప్పుకుంది. బదులుగా మా దగ్గరే వెనెజువెలా చమురును ఇండియా కొనుగోలు చేస్తుంది” అని ట్రంప్  పోస్టు చేశారు. తాను, మోదీ పనులు చేయించే లీడర్లమని ట్రంప్  పేర్కొన్నారు. అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల (500 బిలియన్  యూఎస్  డాలర్లు) విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్​తో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు కూడా మోదీ ఒప్పుకున్నారని, ఈ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కట్టుబడి ఉంటామని మోదీ చెప్పారని ట్రంప్  వెల్లడించారు. అంతకుముందు మోదీకి ట్రంప్  ఫోన్  చేసి మాట్లాడారని ఇండియాకు అమెరికా రాయబారి సెర్గియో గోర్  తెలిపారు. మోదీపై  ట్రంప్  ప్రశంసల జల్లు కురిపించారని ‘ఎక్స్’లో ఆయన చెప్పారు. 

అమెరికాతో ఇండియా ట్రేడ్  డీల్​ను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్​తో ఫోన్ లో మాట్లాడానని ‘ఎక్స్’లో ఆయన వెల్లడించారు. ‘‘అమెరికా, ఇండియా సంబంధాలపై ట్రంప్​తో సమీక్ష చేశాను. ప్రపంచ శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయి. నా ఫ్రెండ్  ట్రంప్​తో మాట్లాడడం నాకెప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకనుంచి మేడిన్  ఇండియా ప్రాడక్టులపై 18 శాతం పన్ను మాత్రమే ఉంటుంది. 140 కోట్ల భారతీయుల తరపున ట్రంప్​కు బిగ్  థ్యాంక్స్” అని మోదీ తెలిపారు. రెండు పెద్ద ఆర్థిక దేశాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే, అది రెండు దేశాల ప్రజలకు భారీఎత్తున లాభం కలిగిస్తుందని మోదీ చెప్పారు. ట్రంప్ తో కలిసి పనిచేసేందుకు తాను చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.