అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనం సృష్టించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం మెరుపు దాడిలో అరెస్ట్ చేసి.. న్యూయార్క్‌కు తరలించిన మరుసటి రోజే.. ఆ దేశ చమురు నిల్వలపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా తాత్కాలిక అధికారులు సుమారు 3 కోట్ల నుంచి 5 కోట్ల బారెళ్ల హై క్వాలిటీ క్రూడ్ ఆయిల్ అమెరికాకు అప్పగించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే ట్రంప్ ఇక్కడితో ఆగకపోవటమే అసలైన విషయం.
చౌక ధరకే చమురు.. తగ్గిన రేట్లు
ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెనిజులా నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్ ధర బారెల్‌కు సుమారు 55 డాలర్లుగా ఉండనుంది. ఈ భారీ ఒప్పందం విలువ 1.65 బిలియన్ డాలర్ల నుండి 2.75 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా అంటూ ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బారెల్‌కు ఒక డాలర్ వరకు తగ్గి 56 డాలర్లకు చేరుకోవడం గమనార్హం.
ట్రంప్ చేతిలో డబ్బు నియంత్రణ:
అమెరికాకు వెనిజులా క్రూడ్ ఆయిల్ అమ్మటం ద్వారా వచ్చే డబ్బు తన గుప్పిట్లోనే ఉంటుందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. వెనిజులా ప్రజలకు, అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడేలా తాను ఆ నిధులను ఖర్చు చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్‌ను ఆయన ఆదేశించారు. వెనిజులాలో ధ్వంసమైన క్రూడ్ ఆయిల్ మౌలిక సదుపాయాలను బాగు చేసేందుకు అమెరికా కంపెనీలు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తాయని.. తద్వారా ఆ దేశానికి ఆదాయం మొదలవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
అసలేం జరిగింది..?
గత శనివారం అర్ధరాత్రి అమెరికా దళాలు వెనిజులాలో భారీ సైనిక చర్య చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పోరాటంలో 24 మంది వెనిజులా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులను ఎదుర్కోవడానికి మదురోను న్యూయార్క్‌కు తరలించారు. ఈ పరిణామం సౌత్ అమెరికా రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్‌లోనూ పెను మార్పులకు దారితీస్తోంది. అమెరికా అధీనంలోకి వెనిజులా చమురు నిల్వలు రావడం వల్ల భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
