
మూడు విడతల్లో బీటెక్, బీ ఫార్మసీ అడ్మిషన్లు
జూన్ 27 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఎప్సెట్ అడ్మిషన్ల ప్రక్రియను మూడు విడతల్లో చేపట్టనున్నట్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. జూన్ 27 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్లో శుక్రవారం అడ్మిషన్ల కమిటీ సమావేశం జరిగింది. దీనిలో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా జూన్ 27 నుంచి జులై 5 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది.
జూన్ 29 నుంచి జులై 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. జూన్ 30 నుంచి జులై 8 దాకా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉండగా, జులై 12లోగా సీట్ల అలాట్మెంట్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 16లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 19న, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 20న ఉంటుంది. జులై 20, 21వ తేదీల్లో వెబ్ ఆప్షన్ ప్రక్రియ కొనసాగనున్నది. జులై 24న లేదా అంతకంటే ముందే స్టూడెంట్లకు సీట్లను కేటాయించనున్నారు. ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ జులై 30 నుంచి ఆగస్టు 7 దాకా కొనసాగనున్నది. ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియను కన్వీనర్ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఆగస్టు 12, 13వ తేదీల్లో ఆప్షన్ల ప్రక్రియ, 16న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 17వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. కాగా ఇతర వివరాలకు https://tgeapcet.nic.in వెబ్ సైట్ ను పరిశీలించాలని అధికారులు సూచించారు.