సర్కారే పెద్ద డిఫాల్టర్

సర్కారే పెద్ద డిఫాల్టర్

హైదరాబాద్‌‌, వెలుగు: డిస్కంల పెద్ద డిఫాల్టర్ రాష్ట్ర ప్రభుత్వమేనని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అన్నారు. సర్కార్ బకాయిలు చెల్లించకపోవడంతోనే డిస్కంలు అప్పులపాలయ్యాయని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ లక్డీకాపూల్​లోని ఫ్యాప్సీలో కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కౌన్సిల్(ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావు ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ తరఫున రేవంత్ వాదనలు వినిపించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కరెంట్‌‌ వినియోగదారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీలు, పథకాలపై చార్జీలను డిస్కంలకు చెల్లించాలి. ప్రభుత్వం ఏటా డిస్కంలకు రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.5,652 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. ఏటా రూ.10 వేల కోట్లకు పైగా ఎగవేస్తోంది. దీంతో డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయి. బిల్లులు చెల్లించని వినియోగదారులపై కేసులు పెట్టినట్టే, ప్రభుత్వంపైనా కేసులు పెట్టాలి”  అని డిమాండ్ చేశారు. వినియోగదారులపై చార్జీల భారం మోపే డిస్కంలు.. సర్కార్ నుంచి బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. కరెంట్ నష్టాలను వ్యవసాయం ఖాతాలో వేస్తున్నారని... హైదరాబాద్, సిద్దిపేట, గజ్వేల్ లో కరెంటు నష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. చార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని, డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ తోసిపుచ్చాలని కోరారు. 
శ్రీశైలం ఘటనపై రిపోర్టులేవీ? 
నిర్వహణ లోపం కారణంగా పల్లెల్లో కరెంటు తీగలు వేలాడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని రేవంత్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో జనం చనిపోతున్నారన్నారు. జనం ప్రాణాలంటే లెక్కలేదా? అధికారులపై కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. 2020–21లో 698 మంది కరెంట్ షాక్​తో చనిపోయారని చెప్పారు. శ్రీశైలంలో జరిగిన ఘటనపై సీఐడీ, ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ రిపోర్టులను ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రమాదంపై ఈఆర్సీ సుమోటోగా విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. 
 

నంబర్ వన్ అయితే ర్యాంకేదీ? 
రాష్ట్రంలో సర్కార్ సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఒక్క మెగావాట్ మాత్రమేనని రేవంత్‌‌ చెప్పారు. యూనిట్‌‌కి 70 పైసలు అధికంగా పెట్టి మరీ సోలార్ పవర్ కొంటున్నారని తెలిపారు. ‘‘దేశంలో మేమే నంబర్ వన్‌‌ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పవర్‌‌ మినిస్ట్రీ రేటింగ్‌‌లో అడుగున ఉన్నారు. దేశంలో మొత్తం 41 డిస్కంలు ఉంటే.. అందులో మన సదరన్‌‌ డిస్కం 23, నార్తర్న్‌‌ డిస్కం 33వ స్థానంలో ఉన్నాయి. జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీలుగా ఐఏఎస్‌‌ ఆఫీసర్లను నియమించాల్సి ఉండగా, 70 ఏండ్లు నిండిన రిటైర్డ్‌‌ అధికారులను నియమించారు” అని ఫైర్ అయ్యారు. డిస్కంలకు బకాయిలు చెల్లిస్తే చార్జీలు పెంచాల్సిన అవసరముండదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.

ఖర్చులు పెరగడంతోనే చార్జీల పెంపు: రఘుమారెడ్డి
విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ఖర్చులు పెరిగాయని.. అందుకే ఐదేండ్ల తర్వాత కరెంట్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. 2022–23లో రూ.6,831 కోట్ల కరెంట్​ చార్జీల పెంపుకు ప్రతిపాదనలు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ డిమాండ్ 6,666 మెగావాట్లు ఉండగా.. ఇప్పుడది 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. కరెంటు వాడకం144 ఎంయూల నుంచి 283 ఎంయూలకు పెరిగిందని పేర్కొన్నారు.