- గతేడాది ఆగస్టు 19 ములుగులో ఉపా చట్టం కింద కేసులు
- ఐపీసీలోని మరో 10 సెక్షన్లనూ చేర్చిన పోలీసులు
- మావోయిస్టులతో కలిసి కుట్ర చేస్తున్నారని అభియోగం
- సీఐ శంకర్ ఫిర్యాదుతో కేసులు పెట్టిన తాడ్వాయి పోలీసులు
హైదరాబాద్ : మేధావుల పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. పౌరహక్కుల నేత ప్రొ.హరగోపాలర్‌తో పాటు మరో 152 మందిపై పెట్టిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా) కింద నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్ డీజీపీ అంజనీకుమార్‌కు శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ములుగు జిల్లా ఎస్‌పీకి డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. ఉపా, ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
గతేడాది ఆగస్టు 19న..
గతేడాది ఆగస్ట్ 19న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ములుగు జిల్లా తాడ్వాయి మండలం అస్నగూడ-ఎల్లాపూర్ బీరెల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్నాయని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. పస్రా సీఐ వీ శంకర్ ఏడుగురు కానిస్టేబుల్స్ తో కలిసి తనిఖీలు చేశారు. ఉదయం10 గంటల ప్రాంతంలో నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అలీవ్ గ్రీన్ దుస్తులు ధరించి సమావేశమైన మావోయిస్టులను లొంగిపోవాలని హెచ్చరించగా వారు తప్పించుకున్నారు. ఆ ప్రాంతంలో సోదాలు చేయగా.. మావోయిస్టు సాహిత్యంతో పాటు తెలంగాణలో ఆ పార్టీ అజెండాకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రజాసంఘాల నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ సహా 152 మంది పేర్లు లభించాయి. వీళ్లంతా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంటర్ పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులపై దాడులు, సర్కారు ఆస్తులు ధ్వంసం చేయాలనీ, మారుమూల ప్రాంతములో ఉన్న అమాయక ఆదివాసీ యువతను మావోయిస్ట్ పార్టీ లో చేర్పించడానికి, పార్టీకి నిధులు సమకూర్చాడానికి, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నారని సీఐ శంకర్ తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హరగోపాల్ సహా 152 మందిపై ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
