హైదరాబాద్ ఫిలింనగర్‌లో నకిలీ విజిలెన్స్ అధికారుల హల్‌చల్ చేశారు. రిపోర్టర్ల ముసుగులో వచ్చి గ్యాస్ డెలివరీ బాయ్‌ని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అసలేం జరిగిందంటే.. ఫిలింనగర్ ఎంఆర్‌సీ కమాన్ దగ్గర గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్న ఒక యువకుడిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. తాము విజిలెన్స్ అధికారులమంటూ భయపెట్టారు. నువ్వు గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అమ్ముతున్నావు.. నీపై కేసు పెట్టిస్తాం.. నీ యజమానికి చెప్పి ఉద్యోగం తీయిస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. అమాయక డెలివరీ బాయ్‌ని బెదిరించి ఏకంగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఆ ముగ్గురు వెబ్ ఛానల్ రిపోర్టర్లు. భయపడ్డ ఆ యువకుడు సిలిండర్లు వేయగా వచ్చిన డబ్బును, తన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తాన్ని వారికి ఇచ్చేశాడు. వారు వెళ్ళిపోయాక అసలు విషయం గ్రహించిన బాధితుడు, జరిగిన విషయాన్ని తన ఓనర్‌కు చెప్పాడు.
యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫిలింనగర్ పోలీసులు.. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులను గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 23 వేలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు మరో వ్యక్తి దగ్గర ఉందని నిందితులు తెలపడంతో.. పరారీలో ఉన్న ఆ నాలుగో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రిపోర్టర్లమని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
