మృత్యువు ఎప్పుడూ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు మరణం వెంటాడుతోంది. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఉదయం లేచి క్యాంపస్‌లో వ్యాయామం చేస్తుండగా దురదృష్టవశాత్తూ బాస్కెట్ బాల్ పోల్ మీద పడి 20 ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ విషాద ఘటన పుణెలోని టోలానీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విశాల్ 2024లో పుణెలోని టోలానీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. విశాల్‌కు రోజు ఉదయం లేవగానే వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఇందులో భాగంగానే ఆదివారం (ఏప్రిల్ 5) ఉదయం కూడా రోజు మాదిరిగానే గ్రౌండ్‌కు వెళ్లాడు. క్యాంపస్‌లోని బాస్కెట్ బాల్ పోల్‌ను పట్టుకుని పుల్-అప్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పోల్ విరిగి అమాంతం విశాల్‌పై పడింది.
ఈ ఘటనలో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ గాయాలు తీవ్రంగా కావడంతో అప్పటికే విశాల్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన క్యాంపస్ భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణపై విద్యార్థుల్లో ఆందోళనలను రేకెత్తించింది. ఇటీవల హర్యానాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగిన విషయం తెలిసిందే. రోహ్‌తక్‌లో ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్‌బాల్ పోల్ కూలిపోవడంతో 16 ఏళ్ల జాతీయ స్థాయి క్రీడాకారుడు హార్దిక్ రాఠీ మరణించాడు.
ఈ ఘటనపై టోలానీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీత్ కనుంగో స్పందించారు. ఈ సంఘటనను చాలా విషాదకరమైనదని అభివర్ణించారు. బాస్కెట్ బాల్ పోల్ ను పట్టుకుని పుల్ అప్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ పోల్ విరిగి విశాల్ పై పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు.
