ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపు..

ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపు..

ఇరాన్ తగ్గకపోతే పవర్ ప్లాంట్లు, రోడ్లు, బ్రిడ్జిలపై దాడి తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పిన వేళ భారతీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం స్వల్ప లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా ఇవాళ మార్కెట్లో దేశీయ టెక్స్ స్టాక్స్ టీసీఎస్, హెచ్సీఎల్, విప్రో లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. 

మధ్యాహ్నం 11.58 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 146 పాయింట్ల నష్టంలో ఉండగా, నిఫ్టీ సూచీ 34 పాయింట్లు కోల్పోయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో ఉండగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 209 పాయింట్లు ఎగబాకింది. ఈ రోజు మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు చాలా యాక్టివ్ గా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. 

►ALSO READ | చిన్న కార్లకు కాలం చెల్లిందా? SUVలపై మనసుపడుతున్న ఇండియన్ మిడిల్‌క్లాస్

ఇదే క్రమంలో భారత ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతులపై ధరలను తగ్గించటంతో సెన్కో గోల్డ్, కల్యాణ్ జ్యువెలర్స్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి. దిగుమతుల ఖర్చులు తగ్గితే మార్జిన్లు పెరిగి, ఇన్ పుట్ కాస్ట్ తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లకు మెుగ్గుచూపుతున్నారు.

అయితే ప్రస్తుతం భారత మార్కెట్లతో పాటు గ్లోబల్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ట్రంప్ ఇరాన్ కి ఇచ్చిన 10 రోజుల గడువు ముగుస్తున్న వేళ హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా ఎలాంటి చర్యలతో ముందుకు సాగుతుందనే భయాలు వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో జరిగే పరిణామాలే మార్కెట్లకు దిశా నిర్థేశం చేస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.