రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్లోనే బాధితులకు మెరుగైన వైద్యం అందించి మృత్యువు నుంచి తప్పించేలా చర్యలు చేపట్టబోతున్నది. ఇందుకోసం ప్రభుత్వం స్టేట్ ట్రామా కేర్ పాలసీని రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హైవేల ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఫోర్ లెవెల్ చైన్ సిస్టమ్..
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి పేషెంట్ కండిషన్‌ను బట్టి వైద్యం అందేలా ఈ నెట్ వర్క్‌ను డిజైన్ చేశారు. మొత్తం నాలుగు లెవెల్స్‌లో సర్వీస్‌లను విభజించి చికిత్సను అందించేలా ప్లాన్ చేస్తున్నారు. నాలుగో లెవెల్లో ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకునే 108 అంబులెన్స్ ఇక్కడ మొదటి రెస్పాండర్‌గా పనిచేస్తుంది. అంబులెన్స్‌లోనే ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తూ దగ్గరలోని సెంటర్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రతి ట్రామా కేర్ సెంటర్‌కు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
మూడో లెవెల్లో జిల్లా హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయనున్న ట్రామాకేర్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తారు. రెండో లెవెల్లో జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్(టీచింగ్ హాస్పిట్స్)లో ట్రామా ట్రీట్మెంట్, మేజర్ సర్జరీలు చేస్తారు. ఇక ఫైనల్‌గా మొదటి లెవెల్లో అత్యంత విషమంగా ఉన్న కేసులను హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, త్వరలో ప్రారంభించబోయే టిమ్స్ తోపాటు వరంగల్ లోని ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు తరలించి అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ అందిస్తారు.
