
- షెడ్యూల్ వచ్చేలోపు ఖర్చు చేయాలనే ఆరాటం
- అక్కెర లేకున్నా రోడ్ల మీద రోడ్లు
- రూల్స్ పట్టట్లే.. క్వాలిటీ ఉండట్లే..
- ఉన్న రైతుబజార్ ఓపెన్ కాకముందే..
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు శిలాఫలకం
- స్థానికేతరులకు పనులపై లోకల్ లీడర్ల నారాజ్
కరీంనగర్, వెలుగు:మంచిగున్న రోడ్ల మీదనే మళ్లా రోడ్లేస్తున్నరు. చేసిన పనులనే తిర్లమర్ల చేసి మళ్లా మళ్లా చేస్తున్నరు. అవసరం ఉన్నా లేకున్నా.. ఏది పడితే అది మంజూరు చేస్తున్నరు. కోట్లకు కోట్లు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నరు. మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చి శంకుస్థాపనలు చేస్తున్నరు. ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కనిపిస్తున్న ఇచ్చంత్రాలు ఇవి. ఇప్పటికే సెగ్మెంట్లోని అన్ని మండలాల్లో రూ. 200 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఇందులో హుజూరాబాద్, జమ్మికుంట టౌన్లకు రూ. 65 కోట్లు శాంక్షన్ కాగా, హుజూరాబాద్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చౌరస్తాల బ్యూటిఫికేషన్ వర్క్స్ మొదలయ్యాయి.
ప్రభుత్వం నుంచి ఇబ్బడిముబ్బడిగా ఫండ్స్ వస్తుండడంతో తమ వార్డుల్లో పనులు చేయించుకోవాలని కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు అవసరం ఉన్నా, లేకున్నా ప్రపోజల్స్ పంపి శాంక్షన్ చేయించుకుంటున్నారు. దీంతో చాలా చోట్ల బాగున్న సీసీ రోడ్ల మీద మరోసారి సీసీ వేయడానికి సిద్ధమయ్యారు. ఏ వార్డులో ఏ రోడ్డు, డ్రైనేజీ దెబ్బతిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాల్సిన ఆఫీసర్లు మిన్నకుంటున్నారు. లోకల్ లీడర్ల ప్రపోజల్స్ మేరకు ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రపోజల్స్‌కు గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. పనులను బట్టి ఒక వార్డుకు ఎక్కువ , మరో వార్డుకు తక్కువ ఫండ్స్ఇస్తే లేని పోని తలనొప్పి అని భావించారో ఏమో వచ్చిన ఫండ్స్‌ను వార్డుల మధ్య పంచేస్తున్నారు. ఉదాహరణకు జమ్మికుంట పట్టణంలో 30 వార్డులు ఉండగా, ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం రూ. 73 లక్షల చొప్పున కేటాయించారు. దీని ద్వారా పనులపై రూలింగ్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
అస్తవ్యస్తంగా పనులు..
ఉప ఎన్నిక నేపథ్యంలో అభివృద్ధి పనుల కోసం హుజూరాబాద్ పట్టణానికి రూ. 35కోట్లు, జమ్మికుంట టౌన్ కు రూ. 30 కోట్లు, ప్రతి మండలానికి రూ. 40 కోట్ల చొప్పున సుమారు రూ.200 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ పట్టణంలో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అంబేద్కర్ చౌక్ నుంచి సాయిబాబా టెంపుల్ వరకు రూ.9కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలిస్తే చాలు, ఈ పనుల పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ప్రజాధనం ఎంత నిర్లక్ష్యంగా ఖర్చు పెడుతున్నారో తెలుస్తుంది. రోడ్డు వేసేముందు కనీస నిబంధనలు పాటించడం లేదు. రోడ్డు వైడనింగ్ చేయకుండానే సీసీ పోసేస్తున్నారు. రోడ్ల మీద ర్యాంపులు.. ఇతరత్రా నిర్మాణాలను అలాగే వదిలేస్తున్నారు. కొత్తగా రోడ్డు వేస్తున్న చోట కొంత లోతుగా తవ్వి సిమెంట్కాంక్రీట్వేయాల్సి ఉన్నా, పైపైన మట్టి తీసి రెడీమిక్స్ పోస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో రోలింగ్ చేయకపోవడంతో చిందరవందరగా కనిపిస్తోంది. దీని పైనే40 ఎంఎం కంకర లేయర్ వేస్తున్నారు.మధ్యలో ఉన్న రోడ్డును పూర్తిగా తొలగించి వేయాల్సి ఉన్నా.. ఆ పని చేయడం లేదు. చెట్లను, స్తంభాలను అలాగే వదిలేస్తున్నారు. డ్రైనేజీలను పట్టించుకోవట్లేదు. దీంతో నాలుగు కాలాలపాటు ఉండాల్సిన రోడ్డును ఇట్లనేనా వేసేది? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఆఫీసర్ల పర్యవేక్షణ ఉన్నా.. క్వాలిటీ సున్నా..
నియోజకవర్గంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులు ఏదో ఒక దశలో ఉండగా, వాటి పర్యవేక్షణ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ ఆఫీసర్లందరినీ రంగంలోకి దించారు. పనులు పూర్తయ్యే వరకు తమకు కేటాయించిన ఊళ్లలోనే ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఏఈలు, డీఈలు, ఇతర ఆఫీసర్లు, స్టాఫ్ అందరూ ఆయా మండల కేంద్రాల్లోనే మకాం వేశారు. అక్కడి నుంచి వారి పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి మండలానికి గతంలో ఉన్న ఏఈతో పాటు మరో నలుగురిని అలాట్ చేశారు. వీరిపై పర్యవేక్షణ కోసం మండలానికి ఇద్దరు డీఈలను ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా పనులు దాదాపుగా పూర్తికావాలని సర్కారు ఆదేశించడంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్లు పనులు చేస్తున్నా కిమ్మనడం లేదు. అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నా పనుల్లో క్వాలిటీ ఉండడం లేదని పబ్లిక్ అంటున్నారు. పెద్దసంఖ్యలో పనులు జరుగుతుండడం, త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించడం వల్లే ఆఫీసర్లు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో కేవలం10 ఫీట్లు మాత్రమే సీసీ రోడ్లు పోస్తున్నా పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి.
నాన్ లోకల్ టెండర్స్.. లోకల్ లీడర్ల నారాజ్
ఎన్నికల పనులను తామే చేపట్టి నాలుగురాళ్లు వెనుకేసుకుందామని ఆశించిన లోకల్ లీడర్లకు సర్కారు నుంచి నిరాశే ఎదురైంది. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు మంజూరైన పనుల్లో స్థానికులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. హుజూరాబాద్ లో రూ.35 కోట్ల పనులకు, జమ్మికుంట లో రూ.30 కోట్ల పనులకు టెండర్లు పూర్తికాగా, పనులను కరీంనగర్, హైదరాబాద్ కు చెందిన కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. ఆ కాంట్రాక్టర్లకు పనులు రావడానికి ఓ ఇద్దరు మంత్రులు చక్రం తిప్పినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ కాంట్రాక్టర్లు తామే అన్ని పనులను పూర్తి చేస్తామని.. లోకల్ లీడర్లు జోక్యం చేసుకోవద్దని బహిరంగంగా చెబుతున్నారు. కనీసం ఇలా చేయాలి.. అలా చేయాలి అని చెప్పినా వినిపించుకోవడం లేదని లోకల్‌గా ఉన్న కౌన్సిలర్లు నారాజ్ అయితున్నరు.