- కోఠి ఉమెన్స్ కాలేజీలో పెట్టేందుకు గతంలో ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో మూడున్నర ఏండ్ల కింద మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హడావుడి చేసిన తెలంగాణ సర్కారు, ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీనే ఉమెన్స్ వర్సిటీగా మారుస్తామని ప్రకటించి, ఆ మాటే మరిచిపోయారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టిన టీఆర్ఎస్, అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అవుతున్నా ఆ హామీని అమలు చేయలేకపోయింది. దీంతో కోరుకున్న వర్సిటీల్లో పలు కోర్సుల్లో సీట్లు దొరక్క, స్టూడెంట్లు చదువు మానేస్తున్నారు. అయితే దీనికి ఓ మంత్రి ప్రైవేటు మహిళా వర్సిటీ ఏర్పాటు చేస్తుండడంతోనే, అప్పట్లో పక్కనపెట్టారనే విమర్శలు వచ్చాయి. ఉమ్మడి ఏపీలో చిత్తూరు జిల్లా తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది. దీంతో అప్పటి నుంచే తెలంగాణలోనూ ఓ మహిళా వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొనసాగింది. రాష్ర్టం ఏర్పడిన తర్వాత అది మరింత పెరిగింది. టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలోనూ మహిళా వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చినా పట్టించుకోకపోవడంతో, స్టూడెంట్ల ఆందోళనలు, వినతుల తర్వాత ప్రభుత్వం ఉమెన్స్ వర్సిటీ ఏర్పాటుపై స్పందించింది. ఆ తర్వాత హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీని వర్సిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుమారు 40 ఎకరాల్లో ఈ కాలేజీ విస్తరించి ఉండటం, కాలేజీ భవనాలు, పరిసరాలన్నీ వర్సిటీకి అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం కూడా ఇక్కడే పెట్టేందుకు ఆలోచన చేసింది. 2018 ఫిబ్రవరిలో అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉమెన్స్ కాలేజీలో భవనాలను, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. 2018–19 లోనే తెలంగాణ మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీని మారుస్తామని అదే రోజు ప్రకటించారు. నెల రోజుల్లోనే వర్సిటీ ప్రారంభించేందుకు కావాల్సిన వసతులు, సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను అప్పట్లో ఆదేశించినట్టు ఆయన చెప్పారు. మరోపక్క కొంతమంది ప్రొఫెసర్లతో మహిళా వర్సిటీ సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయగా, ఆ కమిటీ కూడా ఉమెన్స్ కాలేజీలోనే పెట్టాలని నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉమెన్స్కాలేజీ అటానమస్ కాలేజీగా ఉండటంతో, దీనికి వర్సిటీ హోదా రావాలంటే, ప్రభుత్వం చట్టం చేస్తే సరిపోతుందని దాంట్లో పేర్కొన్నారు. దీంతో అప్పట్లో ఆర్డినెన్స్ ద్వారా మహిళా వర్సిటీ హోదా కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ మళ్లీ మహిళా యూనివర్సిటీ పేరునే ఎవ్వరూ ఎత్తడం లేదు.
డిగ్రీ, పీజీలో అమ్మాయిలే ఎక్కువ...
రాష్ర్టంలో పీజీ, డిగ్రీ చేస్తున్న వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2020-–21లో డిగ్రీలో అబ్బాయిలు 1,07,898 మంది చేరితే, అమ్మాయిలు 1,04,531 మంది చేరారు. 2019-–20లో డిగ్రీలో 1,01,855 మంది అమ్మాయిలు చేరితే, అబ్బాయిలు 87,645 మంది చేరారు. లాస్టియర్ మినహా గత మూడేండ్లుగా డిగ్రీలో అమ్మాయిలే ఎక్కువ మంది అడ్మిషన్లు పొందారు. మరోపక్క పీజీలోనూ అమ్మాయిలే ఎక్కువ మంది అడ్మిషన్లు పొందుతున్నారు.
ఆగేందుకు కారణం ఇదేనా..?
రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, 2018 మార్చిలో ప్రైవేటు వర్సిటీల చట్టం బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. దీన్ని 2019 జులై నుంచి అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 17ను విడుదల చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన ఓ మినిస్టర్ మహిళా వర్సిటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2020–21లో వర్సిటీకి పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్లీ, దాన్ని జనరల్ వర్సిటీగా మార్చుకున్నారు. ఆ మంత్రి కోసమే మహిళా వర్సిటీ ఆపారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయినా సర్కారు పట్టించుకోలేదు. అయితే ఆ మంత్రి కూడా మహిళా వర్సిటీ ఏర్పాటుపై వెనక్కి తగ్గడంతో స్టేట్లో ఉమెన్స్ వర్సిటీయే లేకుండా పోయింది. ఇప్పటికైనా మహిళా వర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి, మహిళా సంఘాలు, విద్యావేత్తలు కోరుతున్నారు.
