- వర్టికల్ విధానంలో పోస్టులు భర్తీ చేస్తున్నారని ఆరోపణ
- గురుకుల బోర్డు స్పష్టత ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వివిధ సొసైటీల పరిధిలోని గురుకులాల పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా లేక వర్టికల్ విధానాన్ని కొనసాగిస్తున్నారా అనే దానిపై గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టత ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న 1940 జూనియర్ లెక్చరర్లు, 793 డిగ్రీ లెక్చరర్లు, 73 ఫిజికల్ డైరెక్టర్లు, 86 లైబ్రేరియన్లు తదితర పోస్టుల భర్తీకి గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 2,876 పోస్టుల్లో దాదాపు 2,301 పోస్టులు మహిళలకే కేటాయించారు. విమెన్స్ గురుకులాల్లోని పోస్టులన్నీ మహిళలకే కేటాయించారు. ఇక బాయ్స్ గురుకులాల్లో పూర్తి స్థాయి రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఉదాహరణకు టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ బాయ్స్ గురుకులాల్లో 115 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉంటే, 47 జనరల్ కేటగిరిలో, 68 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఇదే సొసైటీ విమెన్స్ గురుకులాల్లో 138 జేఎల్ పోస్టులుంటే అన్నీ వారికే అలాట్ చేశారు.
టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ బాయ్స్ గురుకులాల్లో 115 జేఎల్ పోస్టులు ఉండగా.. వాటిలో 75 పోస్టులను మహిళలకు కేటాయించి, మిగిలిన 40 పోస్టులను జనరల్ కేటగిరిలో ఉంచారు. బాయ్స్ బీసీ గురుకులాల్లో 532 జేఎల్ పోస్టులుంటే, వాటిలో 290 జనరల్ కేటగిరి, 242 పోస్టులు విమెన్స్ కేటగిరిలో ఉన్నాయి. ఇలా అన్ని పోస్టుల్లోనూ ఇదే రిజర్వేషన్ అమలు చేశారు. అయితే, ఈ విధానంపై అందరిలో అయోమయం నెలకొంది. వర్టికల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో ముందుగా వర్టికల్ విధానంలో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా హైకోర్టు తప్పుపట్టింది. హారిజాంటల్ రిజర్వేషన్ల (మహిళలకు 33 శాతం పోస్టులు) విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించగా.. దానికి టీఎస్ పీఎస్సీ అంగీకరించింది. కానీ గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు మాత్రం వర్టికల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఓయూతో పాటు పలు చోట్ల అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఏ విధానం పాటిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం అమలవుతున్న విధానాన్నే కొనసాగిస్తున్నామని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ విధానం ఏంటో మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
