రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మే 10వ తేదీన బుధవారం వెల్లడి కానున్నాయి. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు.
ఏప్రిల్ 14వ తేదీన వాల్యూయేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 18 సెంటర్లలో మొదలైన ఈ ప్రక్రియ ఏప్రిల్ 21వ తేదీ వరకు కొనసాగింది. ఫలితాల్లో తప్పులు దొర్లకుండా ట్రయల్ రన్ నిర్వహించారు. ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేశారు. టెక్నికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసిన అధికారులు మే 10న ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఫలితాల కోసం ఇలా చెక్ చేసుకోండి..
- పదో తరగతి విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవాలంటే https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. SSC Results పై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2022లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా.., బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా నమోదైంది. ఇక జిల్లాల వారీగా సిద్దిపేట జిల్లా 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
