IPL 2026: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రాహుల్, నిస్సాంక.. రాజస్థాన్‎పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ

IPL 2026: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రాహుల్, నిస్సాంక.. రాజస్థాన్‎పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ 19లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. లీగ్‏లో వరుస ఓటముల పరంపరకు తెరదించుతూ ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాటపట్టింది. ఓపెనర్స్ కేఎల్ రాహుల్ (75), పాథుమ నిస్సాంక (62) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్‎పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఆర్ఆర్ నిర్ధేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేధించి 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ (90), జురెల్ (43), ఫెరీరా (47) రాణించారు. అనంతరం రాజస్థాన్ నిర్ధేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. నితీష్ రాణా (33), ఆశుతోష్ శర్మ (25) రాణించారు. 

పరాగ్, ఫెరీరా మెరుపులు

 జైపూర్‎లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‎కు దిగిన రాజస్థాన్ రాయల్స్‏కు సరైన శుభారంభం దక్కలేదు. భీకర ఫామ్‎లో ఉన్న ఆర్ఆర్ యువ ఓపెనర్స్ యశస్వీ జైశ్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే సిక్సర్ బాది ఊపుమీదున్న జైశ్వాల్‎ను మూడో బాల్‎కే ఔట్ చేసి స్టార్క్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 

ఈ సీజన్లో సిక్సర్ల వర్షం కురిపిస్తోన్న వైభవ్ సూర్యవంశీని రెండో ఓవర్లలోనే జేమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో జతకట్టిన కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపించారు. ఓ ఎండ్‎లో జురెల్ వికెట్ కాపాడుకుంటూ మెల్లగా ఆడగా..  మరోవైపు కెప్టెన్ పరాగ్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో భారీ షాట్‎కు యత్నించి జురెల్ (42) ఔట్ కావడంతో మూడో వికెట్‎కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 

వేగంగా ఆడే క్రమంలో రియాన్ పరాగ్ 90 పరుగుల దగ్గర స్టార్ బౌలింగ్‎లో క్యాచ్ ఔటయ్యాడు. జడేజా (20) ఫర్వాలేదనిపించాడు. చివర్లో డొనొవన్ ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాది 47 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్‎లో తొలి మ్యాచ్ ఆడుతోన్న స్టార్క్ 3 వికెట్లు తీసి ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నాడు. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు. 

ఢిల్లీ ఓపెనర్స్ ధనాధన్ ఇన్నింగ్స్

226 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఓపెనర్స్ రాహుల్, నిస్సాంక మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు చెలరేగి ఆడటంతో పవర్ ప్లేలో డీసీ వికెట్ నష్టపోకుండా 70 రన్స్ చేసింది. నిస్సాంక 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 66 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‎కు 110 పరుగుల పార్ట్‎నర్ షిప్‎కు బ్రేక్ పడింది. 

ఆ తర్వాత రాహుల్ (75), నితీష్ రాణా (33) ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపించారు. వేగంగా ఆడే క్రమంలో రాహుల్, నితీష్ రాణా వెనువెంటనే ఔట్ అయ్యారు. ఈ దశలో జతకట్టిన స్టబ్స్ (18), ఆశుతోష్ శర్మ ( 25) బాధ్యయుతంగా ఆడి మిగితా లాంఛనాన్ని పూర్తి చేసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, జడేజా తలో వికెట్ తీశారు.