- బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు..
- తాళి ఉంటే నో ప్రాబ్లమ్: టీఎస్పీఎస్సీ చైర్మన్
- షూస్‌తో కాకుండా చెప్పులతోనే రావాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్జరుగనుంది. ఉదయం10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే 10.15 గంటల లోపు వచ్చే అభ్యర్థులనే సెంటర్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయిన తర్వాతే బయటికి పంపిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి గ్రూప్ 1 పరీక్ష ఇది. 503 పోస్టులకు నోటిఫికేషన్ వేయగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీపడుతున్న వారిలో 51,553 మంది సర్కారు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆదివారం జరిగే పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,019 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, 1,019 మంది చీఫ్ సూపరింటెండెండ్లను, 16 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించామని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తామని, 10.15 గంటలకు గేట్ క్లోజ్ చేస్తామని చెప్పారు. బంగారు ఆభరణాలను తెచ్చుకోవద్దని, అలాగనీ తాళి ఉన్నా సెంటర్లోకి అనుమతిస్తామని తెలిపారు. షూస్ తో కాకుండా చెప్పులతోనే సెంటర్లలోకి రావాలన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 128 సెంటర్లుండగా, అత్యల్పంగా ములుగు, నారాయణపేట, మెదక్ జిల్లాల్లో ఏడేసి చెప్పున పరీక్షా కేంద్రాలున్నాయని జనార్దన్ వివరించారు.
- సెంటర్‌కు తీసుకుపోవాల్సినవి
- హాల్ టికెట్
- ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ కార్డు
- రెండు బ్లాక్/బ్లూ బాల్ పెన్నులు
- తీసుకుపోకూడనివి
- సెల్ ఫోన్లు, బ్లూటూత్,
- ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు
- వాచ్, హ్యాండ్ బ్యాగులు,
- టాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు
- లూజ్ షీట్లు, నోట్స్
