బిహార్‌‌‌‌‌‌‌‌లో వరద బీభత్సం ..ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు

బిహార్‌‌‌‌‌‌‌‌లో వరద బీభత్సం ..ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు
  • 14 జిల్లాల్లో 40 లక్షల మంది ప్రభావితం   
  • బాధితుల కోసం ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు 

పాట్నా: భారీ వర్షాలకు బిహార్‌‌‌‌‌‌‌‌ అతలాకుతలమవుతున్నది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా సుమారు 40 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షాలకుతోడు నేపాల్‌‌‌‌‌‌‌‌ నుంచి భారీగా నీరు వస్తుండటంతో బిహార్‌‌‌‌‌‌‌‌లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పాట్నా, భోజ్‌‌‌‌‌‌‌‌పూర్, సారణ్, వైశాలి, భాగల్‌‌‌‌‌‌‌‌పూర్, బెగుసరాయ్, బక్సర్, సమస్తిపూర్, ముంగేర్, కతిహార్, లఖిసరాయ్, ఖగరియా, పూర్నియా, అర్వాల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. గండక్, కోసి, బుర్హి గండక్, పున్పున్, బాగ్మతి, ఘఘ్ర నదులు ప్రమాద మట్టాన్ని మించి ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం 

బిహార్ ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వరద బాధితుల కోసం వివిధ ప్రాంతాల్లో 723 కమ్యూనిటీ కిచెన్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసి అధికారులు  భోజనం అందిస్తున్నారు. అలాగే, 15 సహాయక శిబిరాలను తెరిచి, సుమారు 13 వేలకు పైగా నిరాశ్రయులకు వసతి, వైద్య సేవలు కల్పిస్తున్నారు. బాధితుల కోసం ఇప్పటివరకు సుమారు 2 లక్షల పాలిథిన్ షీట్లు, దాదాపు 30 వేల డ్రై రేషన్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. 

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి దాదాపు రెండు వేల బోట్లను ఉపయోగిస్తున్నారు. మరోవైపు, గండక్, కోసి, ఇంద్రపురి బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 27 ఎస్డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌, 10 ఎన్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ బృందాలను మోహరించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రానున్న 2 రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.