మరోసారి డీజిల్ సెస్ పెంచిన ఆర్టీసీ

 మరోసారి డీజిల్ సెస్ పెంచిన ఆర్టీసీ

ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం పడనుంది. కిలోమీటరు వారీగా డీజిల్ సెస్ ను విధించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఇవి గురువారం (జూన్ 9) ఉదయం నుంచే అమల్లోకి రానున్నాయి. దూరాన్ని బట్టి ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో 250 కిలోమీటర్ల వరకు రూ.5 నుంచి రూ.45 మేర చార్జీలు పెరగనున్నాయి. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 500 కిలోమీటర్ల వరకు రూ.5 నుంచి రూ.90 మేర, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్ల వరకు రూ.5 నుంచి రూ.125, సూపర్ లగ్జరీ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరం వరకు రూ.10 నుంచి రూ.130, ఏసీ బస్సు సర్వీసుల్లో 500 కి.మీ వరకు రూ.10 నుంచి రూ.170 మేర చార్జీలు పెరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో మాత్రం డీజిల్ సెస్ ను పెంచలేదు. అక్కడి బస్సుల్లో టికెట్ల ధరలు పెరగవని ఆర్టీసీ స్పష్టం చేసింది. 
గతంలో.. 
గతంలో రౌండప్, టోల్ ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఒకసారి చార్జీలు పెంచిన ఆర్టీసీ, మరోసారి ఏప్రిల్ లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒక్కో ప్రయాణికుడి  నుంచి డీజిల్ సెస్ కింద రెండు రూపాయలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచిన విషయం తెలిసిందే.