ఎల్బీ నగర్/ముషీరాబాద్, వెలుగు: మునుగోడు బైపోల్ టైంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు మూడు రోజులుగా సంస్థ ఉద్యోగులంతా నల్లబట్టలు ధరించి మూతికి రిబ్బన్లు కట్టుకొని చేస్తున్న పాదయాత్ర సోమవారం బస్సు భవన్ వద్ద ముగిసింది. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ నుంచి దిల్-సుఖ్ నగర్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. అనంతరం మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య చైర్మన్ రాజి రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నిక టైంలో ఇచ్చిన 2017,2021 వేతన సవరణ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి మళ్లీ యూనియన్ల ఏర్పాటును అనుమతించాలని కోరారు.
కార్మికులకు ఉద్యోగ భద్రతా కల్పించాలని..పనిభారం తగ్గించి వేధింపులు ఆపాలన్నారు. 2013 వేతన సవరణకు చెందిన బాండ్స్ డబ్బులు చెల్లించాలని తెలిపారు. బైపోల్ టైంలో ఎలక్షన్ కోడ్ సాకు చెప్పి ఆర్టీసీ సమస్యలను ప్రభుత్వం దాట వేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 9 లక్షల మందికి వేతనాలు పెంచిన ప్రభుత్వానికి 40వేల మంది కార్మికులకు పెంచడం పెద్ద సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ కల్పించిన హక్కులను లాగేసుకోవడం సరైన పద్ధతి కాదని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు అన్నారు. వెంటనే ఆర్టీసీలో మళ్లీ యూనియన్లను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం రెడ్డి, మారగోని అంజయ్య, కత్తుల యాదయ్య, మోహన్ రెడ్డి, దశరథ, కంది రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
