శివారు రూట్లపై ఆర్టీసీ ఫోకస్

శివారు రూట్లపై ఆర్టీసీ ఫోకస్
  • మెట్రో, సొంత వెహికల్స్​తో సిటీలో పడిపోతున్న ఆక్యుపెన్సీ
  • సంస్థను నష్టాల నుంచి ప్రగతి బాట పట్టించేందుకు అధికారుల చర్యలు

హైదరాబాద్, వెలుగు:  శివారు రూట్లపై ఆర్టీసీ ఫోకస్ చేసింది. సిటీలో ప్రతిరోజు ఒక్కో బస్సు 250 కిలోమీటర్లు మాత్రమే తిరుగుతుండగా, స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా తెరుచుకోకపోవడం, చాలామంది సొంత వాహనాల్లోనే ఎక్కువగా జర్నీ చేస్తుండగా ఆక్యుపెన్సీ పెరగట్లేదు. ప్రస్తుతం గ్రేటర్​లో 1,800 సర్వీసులతో ఆర్టీసీ సేవలు అందిస్తున్నా, ఆక్యుపెన్సీ 40 లోపే వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. మెట్రో, క్యాబ్స్, ఆటోలు ఎక్కువగా తిరిగే రూట్లలో ప్యాసింజర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండగా కొత్త రూట్ల అన్వేషణపై అధికారులు దృష్టి పెట్టారు. కరోనా తర్వాత నష్టపోయిన ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఆఫీసర్లు ఆయా రూట్లలో సర్వీసుల పునరుద్ధరణ, పెంపుపై ఫోకస్​ చేశారు. మెట్రో రూట్లలో కంటే ఎలాంటి ట్రాన్స్​పోర్ట్ ​లేని రూట్లపై స్టడీ చేస్తున్నారు.  మెట్రో రైళ్ల రాకతో ఆయా రూట్లలో సిటీ బస్సుల ఆక్యుపెన్సీపై ఎఫెక్ట్​ పడింది. దీంతో కోర్ సిటీ కంటే శివార్లలో ప్యాసింజర్ల రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచడమే బెటరనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆదాయం పెంచుకోవడంపై  ఇప్పటికే  కొత్త రూట్లపై స్టడీ చేయగా, తాజాగా శివారులోని మండల కేంద్రాలు, గ్రామాలు, సిటీకి రాకపోకలు ఎక్కువగా ఉండే సబ్ అర్బన్ రూట్లలో సర్వీసులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు.  సిటీ చుట్టూ 50–70 కి.మీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపడం ద్వారా ఆక్యుపెన్సీ రేట్​ పెరుగుతుందని నిర్ణయించారు.  
నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు..
సిటీకి60 కిలోమీటర్ల దూరంలోని చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, భువనగిరి, చేవెళ్ల, రాయగిరి, కొల్లూరు, వికారాబాద్ లాంటి ప్రాంతాల వరకు సర్వీసులను నడపడంతో ప్యాసింజర్ల రద్దీ పెరగడంతో పాటు, రోజువారీ ఆదాయం కిలోమీటరుపై రూ. 20 పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ నష్టాలు కొంత తగ్గడంతో పాటు ఆర్టీసీ సేవలు కూడా మెరుగుపడతాయి. నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు ఆక్యుపెన్సీ పెరిగి మరింత ఆదరణ వస్తుందని చెబుతున్నారు. సిటీ రూట్లలో నడుస్తున్న సర్వీసులతో నష్టాలు పెరుగుతున్నాయనే అంచనాతో శివారులకు ట్రిప్పులను పెంచడం ఉత్తమమని ఓ ఆర్టీసీ అధికారి పేర్కొన్నారు.