V6 News

రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల కిటకిట

రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల కిటకిట

తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజూ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు నడుస్తున్నప్పటికీ సరిపోకపోవడంతో మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. దీంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి.  

మరోవైపు సమ్మె కారణంగా  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.తాత్కాలిక కాంట్రాక్టు పద్దతిలో ప్రైవేట్ సిబ్బందిని డ్రైవర్లు, కండక్టర్లను తీసుకొని బస్సులను నడపుతోంది.  అయితే హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలన్న జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఇవాళ్టినుంచి మహాధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడంతో జేఏసీ మహాధర్నాలకు పిలుపునిచ్చింది. 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.