రిజర్వేషన్ ప్రయాణికులకు TSRTC బంపర్ ఆఫర్

రిజర్వేషన్ ప్రయాణికులకు TSRTC బంపర్ ఆఫర్

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముందుస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ క‌ల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆ మేర‌కు ఆన్‌లైన్ ప్యాసెంజ‌ర్ రిజ‌ర్వేష‌న్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయం ఉన్న అన్ని స‌ర్వీసుల‌కు ఈ రాయితీ వ‌ర్తిస్తుంద‌ని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. ఈ స‌దుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్‭లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. కాగా.. ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 

రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉండనున్నాయి. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలని కోరారు. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యమని.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ విధానానికి మంచి స్పంద‌న ల‌భిస్తోందని చెప్పారు.  ప్రయాణికులకు రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి తగిన కృషి చేయడం జరుగుతోందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ  బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్  www.tsrtconline.inను సంద‌ర్శించాలని కోరారు.