మేడారానికి ఆర్టీసీ చార్జీల మోత

మేడారానికి ఆర్టీసీ చార్జీల మోత

వరంగల్, వెలుగు: మేడారం జాతరకు వెళ్లే భక్తులపై ఆర్టీసీ టికెట్ల భారం వేసింది. గత ఏడాది ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన తరువాత డిసెంబర్​ మొదటివారంలో సాధారణ టికెట్​ రేట్లు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దాంతో మేడారం జాతర టికెట్ల రేట్లు కూడా పెరిగాయి.  ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా తరలివస్తుంటారు.

4 వేల బస్సులతో..

మేడారం గ్రామం వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈసారి జాతరకు మొత్తం 4 వేల  బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ముఖ్యంగా వరంగల్ రీజియన్ నుంచి అత్యధికంగా 2,250, హైదరాబాద్ నుంచి 200, కరీంనగర్ రీజియన్ నుంచి 600 బస్సులు, ఆదిలాబాద్ నుంచి 300, ఖమ్మం నుంచి 400,  నిజామాబాద్​ నుంచి 250 బస్సులు జాతర కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అలాగే రద్దీ పెరిగితే ముందు జాగ్రత్తగా మరికొన్ని బస్సులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఆర్టీసీకి చెందిన 12వేల మంది సిబ్బంది సేవలు అందించనున్నారు.

నిరుడితో పోలిస్తే..

2018లో  3,563 బస్సుల ద్వారా 17.64   లక్షల మందిని మేడారానికి తీసుకెళ్లడం ద్వారా  సంస్థకు రూ.23 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి కూడా అదే లక్ష్యంతో పని చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి జాతరకు మరో 7 లక్షల మంది భక్తులను అదనంగా చేరవేసి 23 లక్షల టార్గెట్ చేరుకోవాలని, రూ.30 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది.

స్పెషల్​ టారీఫ్​లు

జాతర వెళ్లే భక్తులకు ఆర్టీసీ స్పెషల్ వడ్డన చేస్తోంది. గత నెల ఆర్టీసీ చార్జిని కిలోమీటర్​కు 20 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు మేడారం జాతర కోసం కొత్తగా రేట్లను నిర్దేశించారు. ఈ మేరకు జాతర సమయంలో ఒక్కో ప్రాంతం నుంచి వెళ్లే వారికి టికెట్​ ధరను రూ. 30 నుంచి 50 వరకు పెంచారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట నుంచి 2018 జాతరలో రూ. 160 స్పెషల్ టారీఫ్ ఉంటే ఈ సారి 190 రూపాయలకు పెంచారు. ఇలా అన్ని రూట్లలో చార్జీలు పెంచడంతో ఆ భారం భక్తులపై పడనుంది.