
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ప్రయాణీకుల కోసం సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఇక ఈ బస్సులకు సాంకేతికతను జోడించి తీసుకొస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కగానే కంట్రోల్ రూంకు సమాచారం వెళ్తుంది. ఈ సమాచారం ద్వారా అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటారు.
అలాగే, ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేశారు. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినా అలారం ఆటోమెటిక్ గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను కూడా ఏర్పాటు చేశారు.