- ఏప్రిల్ 18 నుంచి 29 వరకు అడ్మిషన్లు.. షెడ్యూల్ విడుదల చేసిన పరీక్షల విభాగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్(టీటీసీ) 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సు నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. మే ఒకటో తేదీ నుంచి జూన్ 11 వరకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలని, గరిష్ట వయస్సు 45 ఏళ్లకు మించకూడదని వివరించారు. ఎస్ఎస్సీతోపాటు సంబంధిత ట్రేడ్‌లో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్(టీసీసీ) పాసై ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 18 నుంచి 29 వరకు అడ్మిషన్లు తీసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారు అడ్మిషన్ కార్డులను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత డీఈవో ఆఫీస్‌ను సంప్రదించాలని సూచించారు.

