ట్రంప్ సర్కార్ నుంచి మరో వికెట్ ఔట్.. US ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా

ట్రంప్ సర్కార్ నుంచి మరో వికెట్ ఔట్.. US ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన నుంచి మరో కీలక అధికారిని తప్పుకున్నారు. అత్యంత కీలకమైన యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్రంప్‎కు పంపించారు. తన భర్త అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి కీలక పదవి అప్పగించినందుకు ఈ సందర్భంగా ఆమె ట్రంప్‎కు ధన్యవాదాలు తెలిపారు.

ట్రంప్ పరిపాలనలో ఎలాంటి అంతరాయం కలగకుండా సమగ్రమైన అధికార బదిలీ జరిగేలా చూసేందుకు తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తులసీ గబ్బార్డ్ రాజీనామాను ట్రంప్ ఆమోదించారు. 2026, జూన్ 30న ఆమె తన పరిపాలన నుంచి వైదొలుగుతారని స్పష్టం చేశారు. గబ్బార్డ్ స్థానంలో ఆరోన్ లూకాస్ యూఎస్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక చీఫ్‎గా బాధ్యతలు స్వీకరిస్తారని ట్రంప్ తెలిపారు. ఆరోన్ లూకాస్ ప్రస్తుతం జాతీయ గూఢచార ప్రధాన డిప్యూటీ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. 

‘‘తన భర్త అబ్రహాంకు అత్యంత అరుదైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు ఇటీవల నిర్ధారణ అయింది. రాబోయే వారాల్లో ఆయన పెద్ద సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఈ పోరాటంలో నా భర్తకు మద్దతుగా నిలిచేందుకు తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. మా పదకొండు సంవత్సరాల వివాహ బంధంలో అబ్రహం నాకు ప్రతి విషయంలో అండగా నిలిచాడు. 

జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్‌లో భాగంగా నేను తూర్పు ఆఫ్రికాకు వెళ్లినప్పుడు.. పలు రాజకీయ ప్రచారాలు చేసినప్పుడు.. ఇప్పుడు యూఎస్ ఇంటలిజెన్స్ చీఫ్‏గా పని చేస్తోన్న సమయంలో కూడా అతను నాకు అండగా నిలబడ్డాడు. జీవితంలో నాకు ఎదురైన ప్రతి సవాలులోనూ ఆయన బలం, ప్రేమ నాకు అండగా నిలిచాయి. 

ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో పోరాడుతోన్న అతడిని ఒంటరిగా వదిలేసేందుకు తన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా భర్తకు మద్దతుగా నిలిచేందుకు తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని రాజీనామా లేఖలో తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. 

ఇరాన్ యుద్ధంపై విభేదాలు..?

తులసీ గబ్బార్డ్ ఆకస్మిక రాజీనామా వెనక మరో కారణం ఉందంటున్నారు విశ్లేషకులు. అమెరికా-ఇరాన్ యుద్ధ విషయంలో ట్రంప్, తులసీ గబ్బార్డ్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని.. అధ్యక్షుడి తీరుని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనప్పటికీ ట్రంప్ పరిపాలన నుంచి కీలక అధికారులు వరుసగా తప్పుకోవడం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.