మోత్కూరు (యాదాద్రి), వెలుగు : 'ఏది జరగాలన్నా ఎమ్మెల్యే అయిన నాతోనే అయితది, ఎవ్వరు కిందామీద పడి బొర్లాడినా ఏమీ జరగదు, అన్ని చూసిన నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను' అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో బుధవారం ఆయన మాట్లాడుతూ తాను తెలంగాణ పోరాటంలోనూ, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలనలో భాగంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్‌ను, కార్యకర్తలను ఎవ్వరూ తూలనాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభిృవృద్ధి చేసేందుకు ముందు వరుసలో ఉండి సహకరించుకోవాలని సూచించారు. కార్యకర్తలు ఎవరైనా, ఏ విషయమైనా నేరుగా వచ్చి తనను కలవచ్చని చెప్పారు.
సామన్య కార్యకర్త నుంచి అందరినీ చూశా, కష్టమూ, నిష్టూరమూ, బాధలు అన్నీ చవిచూసిన, ఎక్కడ కూడా కాంప్రమైజ్అయ్యే ముచ్చటే లేదు, డెవలప్‌మెంట్‌కోసం ఎక్కడి వరకైనా వెళ్తాను అని తెల్చి చెప్పారు. బీఆర్ఎస్హయాంలో దళితబంధు మంజూరు చేసినా అందరూ కాంగ్రెస్‌కు అండగా నిలిచారన్నారు. కొందరికి మంజూరైన దళితబంధు సాంకేతిక కారణాల వల్ల హోల్డ్‌లో పడిందని, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి వారందరికీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మల్యే సామెల్హామీ ఇచ్చారు.
