ఢిల్లీలోని హోటల్లో మంటలు..21 మంది మృతి

ఢిల్లీలోని హోటల్లో మంటలు..21 మంది మృతి
  • మృతుల్లో 11 మంది విదేశీయులు    మరో 16 మందికి గాయాలు
  •     మాలవీయ నగర్​లోని ఫ్లరిష్ స్టే హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘోరం
  •     బిడ్డతో మూడో అంతస్తు నుంచి దూకేసిన తల్లి
  •     నేలపై పరుపులు పరిచి కాపాడిన మ్యాట్రెస్ వ్యాపారి
  •     ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాలవీయ నగర్‌‌లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హౌజ్ రాణి ఏరియాలోని ఓ ఇరుకైన సందులో ఉన్న 'ఫ్లరిష్ స్టే బి&బి' హోటల్ బిల్డింగులో ఉదయం 8:30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగి.. ఐదు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది కాలిన గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. మంటలు వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకోవడంతో హోటల్ లోపల ఉన్నవారు అప్రమత్తమయ్యే లోపే ఘోరం జరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని దాదాపు 40 మందిని కాపాడారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే 21 మంది మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. మరో 15 మంది మ్యాక్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుండగా.. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో సఫ్దర్‌‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితులను రక్షించే క్రమంలో  గాయపడిన మరో13 మంది పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

బాధితుల్లో 11 మంది విదేశీయులు

హోటల్‌‌కు సమీపంలోనే 'మ్యాక్స్ ఆసుపత్రి' ఉంది. అక్కడ చికిత్స పొందుతున్న బంధువులను చూసుకోవడానికి సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి పలువురు విదేశీయులు వచ్చారు. ఆస్పత్రికి దగ్గరగా ఉండటంతో ఫ్లరిష్ స్టే బి&బి హోటల్‌‌లో బస చేశారు. అగ్ని ప్రమాదంలో పదకొండు మంది చనిపోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో ఆసుపత్రి వద్ద బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా మంది బాధితులు ఎక్కువగా ఊపిరాడకపోవడం (అస్ఫిక్సియేషన్), కాలిన గాయాలు, ఎముకలు విరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మూడో అంతస్తు నుంచి దూకిన మహిళ 

ఫ్లరిష్ స్టే హోటల్‌‌కు కేవలం 6 గదులు నడుపుకోవడానికే అనుమతి ఉండగా నిర్వాహకులు ఏకంగా 25 గదులను ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద భవనానికి రాకపోకల కోసం కేవలం ఒకే ఒక దారి, అదికూడా ఇరుకుగా ఉండటం, ప్రమాద సమయంలో బేస్‌‌మెంట్‌‌కు తాళం వేసి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. భవనం చుట్టూ మంటలు, పొగ ముంచెత్తడంతో లోపల చిక్కుకుపోయిన వారు కిటికీల అద్దాలు పగులగొట్టి కాపాడాలంటూ కేకలు వేశారు. ఈ క్రమంలో ఒక మహిళ తన చిన్న బిడ్డను గట్టిగా పట్టుకుని మూడో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. స్థానికులు ముందే కింద పరుపులు పరిచి ఉంచడంతో ఆ తల్లి, బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక పరుపుల వ్యాపారి తన వద్ద ఉన్న పరుపులన్నింటినీ రోడ్డుపై పరిచి మానవత్వాన్ని చాటుకున్నాడు.