చెట్టు మీద పిడుగు పడి ఇద్దరు పిల్లలు మృతి

చెట్టు మీద పిడుగు పడి ఇద్దరు పిల్లలు మృతి
  • ఒకరికి తీవ్రగాయాలు
  • మెదక్  జిల్లాలో ఘటన

తూప్రాన్, వెలుగు: చెట్టు మీద పిడుగు పడడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. తూప్రాన్  ఎస్సై శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్  జిల్లా తూప్రాన్  మండలం పడాలపల్లి గ్రామానికి చెందిన కొంత మంది పిల్లలు ఊరులోని ఖాళీ ప్లేస్​లో సాయంత్రం క్రికెట్  ఆడుతున్నారు. ఆ సమయంలో వర్షం రావడంతో తడవకుండా ఉండడంతో పాటు మామిడి పండ్లు తెంపుకోవచ్చని సమీపంలో ఉన్న మామిడి చెట్టు కిందకి వెళ్లారు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడింది. 

దీంతో పంబాల ముత్యాలు, లక్ష్మి దంపతుల కొడుకు  ప్రసాద్(15), నడిపల్లి ఐలయ్య, లక్ష్మి దంపతుల కొడుకు యశ్వంత్(13) అక్కడికక్కడే చనిపోయారు. రవికిరణ్  అనే మరో బాలుడికి గాయాలు కావడంతో తూప్రాన్  గవర్నమెంట్  హాస్పిటల్ కు అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఇద్దరు చిన్నారులు పిడుగు పడి చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.