టోలీచౌకిలో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి

టోలీచౌకిలో  గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి
  • మరో నలుగురికి గాయాలు.. పలు వెహికల్స్​ ధ్వంసం  


మెహిదీపట్నం, వెలుగు: భవన నిర్మాణంలో గోడకూలి ఇద్దరు కూలీలు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా..  ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్​టోలిచౌకీ అల్ హస్నాత్ కాలనీ ప్రాంతంలో ఏడంతస్తుల భవన నిర్మాణ పనుల్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. నసీర్ సులేమాన్​కు చెందిన 300 గజాల స్థలంలో యునైటెడ్ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడుతోంది. ఇందులో శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతానికి చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో కార్మికులు తిరుపతిరావు(31), ఆదినారాయణ (50) ఆర్ రమేశ్, పీ రమేశ్ ఏడో అంతస్తుపై పరంజి కర్రలపై నిల్చొని పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో పైన ఉన్న పిట్టగోడ కూలి మీద పడడంతో వారు కిందపడ్డారు. 

ఈ ప్రమాదంలో  శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మేస్త్రీ ఆదినారాయణ, కూలీ తిరుపతి రావు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీకాకుళానికే చెందిన కూలీ ఆర్ రమేశ్ (29) తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశా ప్రాంతానికి చెందిన మేస్త్రీ ఎం.రమేశ్ (35),  భవనం దగ్గర రోడ్డుపై కింద పార్క్ చేసిన ఆటోలో కూర్చున్న లాల్ అహ్మద్ (50), బిహార్ కు చెందిన వాచ్ మెన్ షబ్నం కాటూన్​(21)కు స్వల్ప గాయాలయ్యాయి.  రెండు ఆటోలతో పాటు ఓ కారుపై కూడా ఇటుకలు పడి ధ్వంసమయ్యాయి. పోలీసులు, హైడ్రా, ఫైర్, జీహెచ్‌‌ఎంసీ సిబ్బంది, ఆఫీసర్లు స్పాట్​కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  డెడ్ బాడీలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. గాయపడ్డ కార్మికులను దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్ తెలిపారు. 

మృతులకు కోటి  పరిహారం చెల్లించాలి

ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ లీడర్​ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదని, వీటిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేరన్నారు. 300 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం కడుతుంటే జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు చనిపోయినా కనీసం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ రాకపోవడం ఏమిటని మండిపడ్డారు.  
- ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్