- ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే ఇద్దరు మృత్యువాత
న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో పోస్టు చేయాలన్న ‘రీల్స్’ పిచ్చి వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ, దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌లోని జెట్‌పూర్‌కు చెందిన అవధ్ తివారీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కారులో రాత్రిపూట షికారుకు వెళ్లాడు. ఫాలోవర్లకు తన డ్రైవింగ్ స్టంట్లు చూపించడానికి కారును వేగంగా నడిపాడు.
తివారీ ఎడమ చేత్తో మొబైల్ పట్టుకుని రీల్ రికార్డ్ చేస్తూ కుడి చేత్తో స్టీరింగ్‌ను పట్టుకుని 120 కిలోమీటర్ల స్పీడుతో కారును పోనిస్తున్నాడు. వెనుక సీటులో కూర్చున్న స్నేహితుడు కూడా కారు స్పీడును షూట్ చేస్తున్నాడు. అతివేగంలో ఉన్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టగా కారు నుజ్జునుజ్జు అయింది. అవధ్ తివారీ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, స్నేహితుడు దేవరాజ్ గోసాయి (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
