- అండర్- 19 వరల్డ్ కప్ ఫైనల్
- మ. 1 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
హరారే: రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఇండియా.. అండర్–19 వరల్డ్ కప్ ఫైనల్‌కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగేమెగా పోరులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన సెమీస్‌లో భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించడం, కెప్టెన్ ఆయుష్ మాత్రే, హైదరాబాద్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ ఫామ్‌లోకి రావడంతో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 2022లో యష్ దూల్ సారథ్యంలో చివరిసారి ట్రోఫీ నెగ్గిన ఇండియా మళ్లీ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఇది జరగాలంటే వైభవ్ సూర్యవంశీ మరోసారి సంచలన బ్యాటింగ్‌ను చూపెట్టాల్సిందే. ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో 264 రన్స్ చేసిన వైభవ్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఫైనల్లో అతను చాలా కీలకం కానున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. టోర్నీ రికార్డు పరంగా చూసినా ఇండియాకు తిరుగులేదు. 16సార్లు టోర్నీ జరిగితే ఇండియా పదిసార్లు టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన చరిత్ర కూడా మనకే అనుకూలంగా ఉంది. విహాన్ మల్హోత్రా, అభిగ్యాన్ కుండుతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. దీపేశ్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, ఆర్.ఎస్. అంబరీష్‌తో కూడి పేస్ దళం ఇప్పటివరకు అద్భుతాలు చేసింది. అయితే ఇంగ్లండ్ జట్టులో పేసర్లను బాగా ఎదుర్కొనే బ్యాటర్లు చాలామంది ఉండటంతో వీళ్లపై ఒత్తిడి నెలకొంది. దాంతో ఇండియా స్పిన్ ద్వయం కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్‌పై ఎక్కువగా ఆధారపడే చాన్స్ ఉంది. పిచ్‌ను బట్టి బౌలింగ్ ఎంపికలు మారనున్నాయి. మరోవైపు ఇంగ్లండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్‌కు వచ్చారు. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలవడం కాన్ఫిడెన్స్ పెంచే అంశం. అత్యధిక వికెట్లు తీసిన పేసర్ మ్యానీ లుమ్స్‌డెన్ (15 వికెట్లు)కు సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో నుంచి సహకారం అందితే ఇండియాకు కష్టాలు తప్పవు. బ్యాటింగ్‌లో బెన్ మేయెస్ (399), కెప్టెన్ థామస్ రేవ్ (299) నుంచి ప్రమాదం పొంచి ఉంది. అయితే ఓపెనర్లు బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్ ఫామ్‌లో లేకపోవడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది.
