- గుండుతో ఉన్నడని ఉబర్ లో ఐడీ బ్లాక్
- టెక్నికల్ సమస్యలతో డ్రైవర్ కు ఇబ్బందులు
హైదరాబాద్,వెలుగు: ఉబర్ క్యాబ్ డ్రైవర్ నెరడి శ్రీకాంత్ నెల రోజుల కిందట తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకున్నాడు. సిటీకి వచ్చాక ఉబర్ కొత్తగా తీసుకొచ్చిన బయోమెట్రిక్ లాగిన్ ను మొబైల్ లో ఓపెన్ చేశాడు. గుండు ఉండడంతో అతడి ఫేస్ రికగ్నైజ్ కాలేదు. దీంతో రాంగ్ ఎంట్రీ ఇచ్చినందుకు అతని ఐడీ బ్లాక్ అయ్యి జాబ్ పోయింది. తన ఐడీని అన్ బ్లాక్ చేసి ఫొటో ఛేంజ్ చేయాలని నెల రోజులుగా ఉబర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గుండు కొట్టించుకుంటే ఫొటో చేంజ్ లాంటి అప్ డేట్స్ చేయాలె కానీ ఐడీని బ్లాక్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు. టెక్నాలజీ సాయంతో ఉబర్ సంస్థ డ్రైవర్లను ఇలా ఇబ్బందులకు గురి చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా తర్వాత క్యాబ్ కంపెనీలు డ్రైవర్లను వేధిస్తున్నాయని యాప్ బేస్డ్ క్యాబ్ డ్రైవర్ల స్టేట్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ అన్నారు. ఉబర్ ఒక్కటే కాదని, ఓలాలోనూ డ్రైవర్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. శ్రీకాంత్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఆయా కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు.
