- మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు
- వరాల్లేవు.. వడ్డింపులూ లేవు.. సాదాసీదాగానే కేంద్ర పద్దు
- సామాన్యులకు దక్కింది లేదు.. వ్యాపారులకు ఊరట లేదు
- పాత పద్ధతిలోనే పన్ను విధానం.. వేతన జీవులకు నిరాశే
- వీబీ జీ రామ్ జీకి రూ. 95 వేల కోట్లు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై
- వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి
- రక్షణ, హోం, వ్యవసాయానికి నిధుల పెంపు
- క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ దాదాపు అన్ని వర్గాలకు నిరాశే మిగిల్చింది. పేద, మధ్య తరగతి ప్రజలకు కొత్తగా ఏ ప్రయోజనం చేకూరలేదు. బడ్జెట్‌లో పెద్దగా వరాలు లేవు. వడ్డింపులూ లేవు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాదాసీదా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై మాత్రం వరాల జల్లు కురిపించారు. రక్షణ, హోం, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కింది. క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించడం, ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్ నెలకొల్పుతామని హామీ ఇవ్వడమే ఊరటనిచ్చే అంశాలు.మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల అంచనాలతో 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ఉదయం లోక్ సభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ సాధన దిశగా, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్నుల విధానంలో పాత పద్ధతినే కొనసాగించడంతో వేతన జీవులకు నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్ స్టాక్ మార్కెట్‌కూ బిగ్ షాకే ఇచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించే చర్యలు పెద్దగా లేకపోగా, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్ టీటీ) పెంచడంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి. మరోవైపు ఏప్రిల్ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తుందని, పాత చట్టంలోని క్లిష్టమైన నిబంధనలు సరళంగా మారుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇక ఉపాధి హామీ స్థానంలో కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ. 95 వేల కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ కింద ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పూర్తి చేసేందుకు రూ. 30 వేల కోట్లు అలకేట్ చేశారు. సంక్షేమ పథకాలు, ఎరువులు, చిన్న పరిశ్రమలకు రాయితీలపై పెద్దగా దృష్టి సారించలేదు. అలాగే ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని వ్యూహాత్మక చాబహర్ పోర్టు ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదు.
వీటికి పర్వాలేదు..
కేంద్ర బడ్జెట్‌లో పలు రంగాలకు నిధుల కేటాయింపు పెరిగింది. ప్రధానంగా రక్షణ, హోం, వ్యవసాయ శాఖలకు నిధుల కేటాయింపును పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఆపరేషన్ సిందూ ర్ ఎఫెక్ట్‌తో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై కేంద్రం ఈ బడ్జెట్ లో దృష్టి సారించింది. ఇందులో భాగంగా రక్షణ శాఖకు రూ. 7.84 లక్షల కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అలాగే, కేంద్ర హోం శాఖకు నిధులను గణనీయంగా పెంచారు. బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. పోయినేడాదితో పోలిస్తే 10 శాతం నిధులను పెంచారు. దేశాన్ని మెడికల్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యంగా 5 రీజినల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు బడ్జెట్ స్పీచ్‌లో నిర్మల ప్రకటించారు. అలాగే, క్యాన్సర్ పేషెంట్లకు ఊరటనిచ్చేలా17 రకాల క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై కేంద్రం ఈ బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేలా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రత్యేక కారిడార్లను ప్రకటించారు. తెలంగాణతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే దేశంలోని ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్ నెలకొల్పుతామని, 15 వేల బడులు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి అనౌన్స్ చేశారు.
దేశంలోని యువ శక్తిని ముందుకు నడిపిస్తూ పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించాం. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకోవాలన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ విజన్.. ఈ మూడు కర్తవ్యాలను స్ఫూర్తిగా తీసుకుని బడ్జెట్‌కు రూపకల్పన చేశాం. ఖాదీ పరిశ్రమను బలోపేతం చేయడానికి మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నిర్మలా సీతారామన్
