నీట్-పీజీ ఎగ్జామ్ రద్దు

నీట్-పీజీ ఎగ్జామ్ రద్దు

న్యూఢిల్లీ: పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఎంబీబీఎస్ లో వచ్చే మార్కుల ఆధారంగానే ఎండీ, ఎంఎస్ సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) సూచన మేరకే సవరించిన బిల్లును సిద్ధం చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు ఒకరు వెల్లడించారు. దీని ప్రకారం ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో నిర్వహించే ‘‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్’’(నెక్ట్స్) ఫలితాల ఆధారంగానే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారని వివరించారు.

అలాగే ఎంబీబీఎస్ తర్వాత ప్రాక్టీసు కోసం ప్రత్యేకంగా రాసే ఎగ్జామ్ ను కూడా రద్దు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, ఎయిమ్స్ లో పీజీ ప్రొగ్రామ్స్ లో అడ్మిషన్ల కోసం మాత్రం తప్పనిసరిగా ఎంట్రన్స్ రాయాల్సివుంటుంది. దీంతో పాటు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరదలుచుకునే స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ పరీక్షను ఎదుర్కొవాల్సిందే. ఏటా 50 వేల మెడికల్ పీజీ సీట్ల కోసం దాదాపు 1.5 లక్షల మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. ఎన్ఎంసీ బిల్లును తొలిసారిగా 2017లో లోక్ సభలో ప్రవేశపెట్టారు. 16వ లోక్ సభ పూర్తి కావడంతో అది రద్దైంది. దీంతో కొత్త బిల్లును ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. అతి త్వరలో ఈ బిల్లు ఆమోదం కోసం కేబినేట్ ముందుకు వెళ్లనుంది.