హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్టీసీ యూనియన్ నేతలు తెలిపారు. సమ్మె విరమణలో, సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆర్టీసీ జేఏసీ నేతలు ఘనంగా సన్మానించారు.
ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నమైన ప్రభుత్వంలో విలీనం, కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ ,11 శాతం పీఆర్సీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయాలు అని మంత్రులతో నేతలు అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.
ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలతో కార్మికుల్లో భరోసా పెరిగిందని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

