టెర్రరిస్టులతో చంపేస్తాం..కేంద్రమంత్రి చిరాగ్‌‌ పాశ్వాన్‌‌కు బెదిరింపు మెసేజ్‌‌

టెర్రరిస్టులతో చంపేస్తాం..కేంద్రమంత్రి చిరాగ్‌‌ పాశ్వాన్‌‌కు బెదిరింపు మెసేజ్‌‌

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి చిరాగ్‌‌ పాశ్వాన్‌‌కు మంగళవారం బెదిరింపు మెసేజ్‌‌ వచ్చింది. ‘హార్డ్‌‌కోర్‌‌ టెర్రరిస్టులతో చిరాగ్‌‌ పాశ్వాన్‌‌ను చంపేస్తాం’ అని కేంద్ర మంత్రి కార్యాలయానికి మెసేజ్‌‌ వచ్చినట్లు ఆయన ప్రైవేట్‌‌ సెక్రటరీ అలోక్‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌ తెలిపారు. అందులో రెండు మొబైల్‌‌ నంబర్లతోపాటు మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపు ఉందని వెల్లడించారు. బెదిరింపు మెసేజ్‌‌ తీవ్రత ఎక్కువగా ఉందని, పాశ్వాన్‌‌ భద్రతపై ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌‌ మోహన్‌‌కు లేఖ రాశారు. పాశ్వాన్‌‌ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన కార్యాలయం కూడా చేస్తూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది.

బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది? అది నిజమైనదేనా? దాని వెనుక ఉన్నవాళ్లెవరు? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని హోంశాఖను కోరింది. పాశ్వాన్‌‌ జెడ్‌‌ కేటగిరీ భద్రత పొందుతున్నారని, ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గోనున్నందున భద్రతను సమీక్షించి మరింత పెంచాలని విజ్ఞప్తి చేసింది. లేఖ ప్రతులను కేంద్ర హోంమంత్రి కార్యాలయ పీఎస్‌‌, ఢిల్లీ పోలీస్‌‌ కమిషనర్‌‌కు కూడా పంపించారు. పాశ్వాన్‌‌ కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌‌ పరిశ్రమల శాఖ మంత్రిగా, లోక్‌‌ జనశక్తి పార్టీ (రామ్‌‌విలాస్‌‌) చీఫ్‌‌గా ఉన్నారు