-
దిశ మీటింగ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ )లో కలెక్టర్ హరిచందనతో కలిసి ఆయన పాల్గొన్నారు.
కిషనర్ రెడ్డి మాట్లాడుతూ.. స్పెషాలిటీ క్యాంపుల ద్వారా మహిళలు, బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ఏరియాల్లో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. కోల్ ఇండియా దవాఖానాల్లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. జిల్లాలో 36 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. యూపీ తర్వాత తెలంగాణలో స్వయం సహాయక సంఘాలు బాగా పని చేస్తున్నాయన్నారు. లాలాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నీటి కోసం పైప్ లైన్ కోసం రైల్వే శాఖ అనుమతులు ఇవ్వాలన్నారు. ముద్ర లోన్లు, తరుణ్ , విశ్వకర్మ పథకం, భీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన జన్‌ధన్‌యోజన వివరాలు వెల్లడించారు. వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, రెవెన్యూ అడిషనల్కలెక్టర్ జి ముకుంద రెడ్డి, బల్దియా అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, జోనల్ కమిషనర్ అపూర్ చౌహాన్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య, సీపీవో డాక్టర్ సురేందర్ పాల్గొన్నారు.
