- 2,400 మెగావాట్లకు వెంటనే పీపీఏ చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
- క్వాలిటీ విద్యుత్ తక్కువ ధరకే లభిస్తున్నా అగ్రిమెంట్ చేసుకోకపోవడంపై అసంతృప్తి
- పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎన్టీపీసీతో విద్యుత్ ఒప్పందం ఎందుకు చేసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. క్వాలిటీ విద్యుత్ తక్కువ ధరకే లభిస్తున్నా అగ్రిమెంట్ చేసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని సూచించారు. రామగుండంలో నిర్మించనున్న 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేందుకు (పీపీఏ) ఒప్పందం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని గుర్తు చేశారు. ‘‘ఈ నెల3న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. 2047 నాటికి ఇది లక్ష మెగావాట్లకు చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో గ్రిడ్ స్థిరత్వం కోసం అదనంగా 5 వేల నుంచి 6 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శాసనసభలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టుగా ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది’ అని పేర్కొన్నారు.
ఎన్టీపీసీ రామగుండం మొదటి దశలో దాదాపు 12వేల కోట్ల వ్యయంతో (2X800 ఎండబ్ల్యూ) అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మించిన ప్లాంట్లను ప్రధాని మోదీ 2023లో ప్రారంభించి జాతికి అంకితమిచ్చారని, అవి విజయవంతంగా నడుస్తున్నాయని కిషన్‌రెడ్డి లేఖలో తెలిపారు. ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 85 శాతం తెలంగాణకే దక్కుతుందని చెప్పారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎన్టీపీసీ పనితీరును, తక్కువ ఉత్పత్తి వ్యయాన్ని మెచ్చుకున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి పీపీఏలు చేసుకుంటున్నాయని గుర్తుచేశారు. మొత్తం 4 వేల మెగావాట్ల (5X800) ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కోరారు. దీంతో క్వాలిటీ విద్యుత్ తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, రాష్ట్ర అవసరాలకు తీర్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
