- బల్క్ యూజర్లు బంకుల వద్దకు రావద్దు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పెట్రోల్ ధరల పెంపు ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బల్క్ యూజర్లు తమకు కేటాయించిన మార్గాల ద్వారా మాత్రమే ఇంధనాన్ని పొందాలని రిటైల్ బంకుల వద్దకు రావద్దని సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై బుధవారం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇంధన కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను భారీగా పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకు 6,400 కిలో లీటర్ల సరఫరా ఉండగా ప్రస్తుతం దానిని 10,300 కిలోలీటర్లకు పెంచినట్లు చెప్పారు. హైదరాబాద్సిటీలో సరఫరాను 3,200 నుంచి రెట్టింపు చేసి 6,400 కిలో లీటర్లకు పెంచామన్నారు. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 8 వేల కిలోలీటర్లు అవసరం ఉండగా ప్రస్తుతం 15,500 నుంచి19,300 కిలోలీటర్ల వరకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
106 ఔట్‌లెట్లలోనే సమస్య
రాష్ట్ర వ్యాప్తంగా 4,325 పెట్రోల్ బంకుల్లో కేవలం 106 ఔట్లెట్లలో మాత్రమే సాంకేతిక కారణాల వల్ల ఇంధన సమస్య వచ్చిందన్నారు. ట్రాన్స్‌పోర్ట్, ఇండెంట్ ఆలస్యం వంటి ఇతర కారణాలతో స్టాక్ తాత్కాలికంగా అందుబాటులో లేదన్నారు. బుధవారం రాత్రి వరకు ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ధరలు పెరుగుతాయని, సరఫరా ఆగిపోతుందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం వల్ల ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారని దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఎల్పీజీ విషయంలో ఎలాంటి కొరత లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు తగినంత సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు.

