రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర విద్యా శాఖ అసంతృప్తి

రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర విద్యా శాఖ అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు మిడ్డెమిల్స్ అందించడంలో తెలంగాణ సర్కారు పూర్తి నిర్లక్ష్యం వహించింది. కరోనా టైమ్,​వేసవి సెలవుల్లో పిల్లలకు భోజనం అందించాలని కేంద్రం సూచించినా ఆ పనిచేయలేదు. మరోవైపు ఇందుకోసం ఇచ్చిన నిధులనూ సక్రమంగా ఖర్చు చేయలేదు. దీనిపై కేంద్ర విద్యా శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ ఆడిట్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 22న మిడ్డెమిల్స్​పై కేంద్ర విద్యా శాఖ అధికారులు.. తెలంగాణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో పీఏబీ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన మినిట్స్​ను రెండ్రోజుల కింద కేంద్రం రిలీజ్ చేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి గానూ మిడ్డెమిల్స్ నిర్వహణకు రూ.286.26 కోట్లను పీఏబీ అప్రూవ్ చేసింది. దీంట్లో రూ.180.56 కోట్లు కేంద్రం ఇస్తుండగా, రూ.105.70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జతచేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా 2021–22 అకాడమిక్ ఇయర్​లో జరిగిన కార్యక్రమాలను సమీక్షించింది.

2021–22లో సర్కారు బడుల్లోని 8.40(75%) లక్షల మంది ప్రైమరీ స్టూడెంట్లకు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 4.73(71%) లక్షల మందికి మాత్రమే మిడ్డెమిల్స్ అందించారు. మరోవైపు సర్కారు స్కూళ్లలోని స్టూడెంట్లకు 158 వర్కింగ్ డేస్, ఎన్​సీఎల్పీ స్కూళ్లకు 214 వర్కింగ్ డేస్ కు భోజనం అందించేందుకు కేంద్రం పర్మిషన్ ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సర్కారు స్కూళ్లలోని పిల్లలకు 86 రోజులు, ఎన్​సీఎల్​పీ స్కూళ్ల పిల్లలకు 93 రోజులు మాత్రమే భోజనం అందించాయి. ఏటా మిడ్డెమిల్స్‌‌ నిర్వహణపై సోషల్ ఆడిట్ చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో ఆ పని చేయలేదు. దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. 2006–2012 వరకూ రాష్ట్రంలో 30,408 కిచెన్ కమ్ స్టోర్ల నిర్మాణానికి కేంద్రం రూ.234.69 కోట్లు ఇచ్చింది. 2021 డిసెంబర్ 31 నాటికి 17,483 కిచెన్ కమ్ స్టోర్ల నిర్మాణం పూర్తవగా.. 3,698 స్టోర్లు నిర్మాణ దశల్లో ఉంటే 9,227 బడుల్లో పనులే ప్రారంభం కాలేదు. 2022 సెప్టెంబర్ నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలనీ లేకపోతే.. ఆ పనులను సరెండర్ చేసి, ఇచ్చిన నిధులను వడ్డీతో పాటు ఇవ్వాలని ఆదేశించింది.