- కాంపిటీషన్లో మన హైదరాబాదీకి థర్డ్ ప్రైజ్
న్యూఢిల్లీ, వెలుగు: భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)‘ఉదయ్’ పేరుతో కొత్త ఆధార్ మస్కట్‌ను ఆవిష్కరించింది. మస్కట్ రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో డిజైన్, పేరు పోటీలను నిర్వహించింది. మస్కట్ పేరు(ఉదయ్) కోసం జరిగిన పోటీలో హైదరాబాద్‌కు చెందిన మహారాజ్ సరన్ చెల్లపిల్ల థర్డ్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు. భోపాల్‌కు చెందిన రియా జైన్ ఫస్ట్ ప్రైజ్, మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఇద్రిస్ దవాయివాలా రెండో బహుమతి గెలుచుకున్నారు.
ఈ పోటీలకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిపుణులు, డిజైనర్లు తదితరుల నుంచి మొత్తంగా 875 అప్లికేషన్లు అందాయి. అలాగే మస్కట్ డిజైన్ పోటీలో అరుణ్ గోకుల్ (త్రిస్సూర్, కేరళ)ఫస్ట్ ప్రైజ్, ఇద్రిస్ దవాయివాలా (పుణె, మహారాష్ట్ర) రెండో బహుమతి, కృష్ణ శర్మ (ఘాజీపూర్, ఉత్తరప్రదేశ్) మూడో బహుమతి సాధించారు. గురువారం కేరళలోని తిరువనంతపురంలో యూఐడీఏఐ చైర్మన్ నీలకంఠ శర్మ ఆధార్ కొత్త మస్కట్ ‘ఉదయ్’ని అధికారికంగా ఆవిష్కరించినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా విజేతలను సత్కరించారు.
