మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్కు తీవ్ర గాయం

మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్కు తీవ్ర గాయం

భారత మాజీ క్రికెటర్, అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కంటికి తీవ్ర గాయమైంది. క్రికెట్ ఆడుతుంటే కంటికి గాయమైందని  ఉన్ముక్త్ చంద్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. కంటి గాయానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. గాయం కారణంగా ఉన్ముక్త్  ఎడమ కన్ను  ఉబ్బింది. 

జస్ట్ మిస్..

‘‘ అందరూ అనుకుంటారు అథ్లెట్ అంటే జీవితం సాఫీగా సాగుతుందని. కానీ అది నిజం కాదు.  కొన్ని సార్లు విజయాలు సాధిస్తాం..మరికొన్ని సార్లు అపజయాలను మూటగట్టుకుంటాం. వీటికి తోడు గాయాల బారిన పడతాం. నాకు పెను ప్రమాదం తప్పింది. దేవుడికి కృతజ్ఞతలు. కష్టపడండి కానీ జాగ్రత్తగా ఉండండి...కొద్దిలో కన్ను పోయేది’’ అంటూ ఉన్ముక్త్ చంద్ ట్వీట్ చేశాడు.

అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..

2012లో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు ఉన్ముక్త్ చంద్ కెప్టెన్.  ఆ తర్వాత ఐపీఎల్ ఆడిన ఉన్ముక్త్ పెద్దగా రాణించలేదు. క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించడానికి ముందే కోహ్లీ, ధోనీ, రైనాలతో కలిసి యాడ్‌లో నటించాడు. డబ్బును చూసిన ఉన్ముక్త్‌ ఆట తగ్గిపోయింది. అటు ఐపీఎల్లోనూ విఫలవడంతో.. క్రికెట్ కే వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. మొత్తం21 మ్యాచులు ఆడి 300 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.  భారత్  తరుపున దేశవాళీ క్రికెట్‌లో 67 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 120 లిస్టు A మ్యాచులు ఆడాడు.   2016 తర్వాత   ఉన్ముక్త్ చంద్‌ను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడానికి  ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.

అమెరికాకు మకాం...

2021 ఆగస్టులో అన్ని రకాల భారత క్రికెట్‌కు ఉన్ముక్త్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికా వెళ్లిపోయిన ఉన్ముక్త్...అక్కడ కోరే అండర్సన్, లియామ్ ప్లంకెట్, జుయాన్ థెరాన్, సమీ అస్లాం వంటి ఆటగాళ్లతో కలిసి యూఎస్ క్రికెట్ టీమ్  కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. భారత్ వేదికగా జరగనున్న 2023 ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ఉన్ముక్త్ సిద్దమవుతున్నాడు.