అన్నదాత ఆగం..అకాల వర్షాలతో భారీగా దెబ్బతిన్న పంటలు

అన్నదాత ఆగం..అకాల వర్షాలతో భారీగా దెబ్బతిన్న పంటలు
  • వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర నష్టం
  • నష్టం అంచనాలో అగ్రికల్చర్‌ ఆఫీసర్లు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వడగండ్లు, ఈదురుగాలుల కారణంగా వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగిపడడం, కరెంట్​స్తంభాలు కూలడంతో విద్యుత్‌ శాఖకు నష్టం జరిగింది.

నెట్‌వర్క్‌, వెలుగు : ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వడగండ్లు, ఈదురుగాలుల కారణంగా వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగిపడడం, కరెంట్​స్తంభాలు కూలడంతో విద్యుత్‌ శాఖకు నష్టం జరిగింది. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం అంచనాలో వ్యవసాయ, విద్యుత్‌ శాఖ ఆఫీసర్లు నిమగ్నమయ్యాయి. 

అకాల వర్షం, వడగండ్ల వాన కారణంగా కరీంనగర్‌ జిల్లాలోని 13 గ్రామాల్లో 336 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్‌ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 321 ఎకరాల మక్కజొన్న, 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. చొప్పదండి మండలం కాట్నేపల్లి, రుక్మాపూర్, రామడుగు మండలం వెలిచాలి, వన్నారం, కరీంనగర్‌ రూరల్‌ మండలం గోపాల్‌పూర్‌,  చామన్‌పల్లి, నగనూరు, మగ్ధూంపూర్‌, ఇరుకుల్ల, చర్లబూత్కూర్, కొత్తపల్లి మండలం నాగులమల్యాల, కొత్తపల్లిలో సుమారు 213 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా రామడుగు మండలం వెలిచాలలో 83  రైతులకు చెందిన 120 ఎకరాల మక్కజొన్న నేలవాలినట్లు తెలిపారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వడగండ్ల వాన కారణంగా 598 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు. కాగజ్‌నగర్‌, చింతలమానేపల్లి, రెబ్బెన మండలాల్లో ఎక్కువ నష్టం ఉన్నట్లు తేల్చారు. 16 గ్రామాల్లో 271 మంది రైతులకు చెందిన మక్కజొన్న, మామిడి, వరి, కర్బూజ పంటలు దెబ్బతిన్నాయి. మానిక్‌గూడ, గోవింద్‌పూర్‌ గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మెదక్‌ జిల్లాలో 142 మంది రైతులకు చెందిన 131.2 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 78 ఎకరాల్లో జొన్న, 28.2 ఎకరాల్లో మామిడి, 18 ఎకరాల మక్కజొన్న, ఏడు ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు గుర్తించారు.

కామారెడ్డి జిల్లాలో  25 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్‌ ఆఫీసర్లు గుర్తించారు. గాంధారి మండలం రాంలక్ష్మన్‌పల్లి, మాత్సంగెం, భిక్కనూరు మండలం అంతంపల్లి, రామేశ్వరపల్లి శివారు, సదాశివనగర్‌ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డి శివార్లలో మక్క పంట నెలకొరిగింది. శనివారం సాయంత్రం దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి మండలాల్లో కొద్ది పాటి వర్షం పడగా, రాజంపేటలో వడగండ్లు పడ్డాయి. 

మంచిర్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో 158 మంది రైతులు 335 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు అగ్రికల్చర్‌ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో 80 ఎకరాల్లో వరి, 255 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు తేల్చారు. మరో ఇరవై రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న మామిడికాయలు గాలివానకు రాలిపోయాయి. హాజీపూర్‌ మండలం సబ్బెపల్లి, రాపల్లి, ధర్మారం, బుగ్గగట్టు గ్రామాల్లో మామిడితోటల్లో కాయలు రాలిపోయాయి. కొండపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో వరి, నర్సింగాపూర్, ధర్మారం గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. హాజీపూర్ మండలంలో సుమారు 80 ఎకరాల మేర వరి, 50  ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగంతో పాటు తుమ్మన్‌పల్లి, బొప్పన్‌పల్లి, సంఘం (కె), కంబాలపల్లి, గుంత మర్పల్లి, జీర్లపల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడడంతో చేతికొచ్చిన జొన్న నేలవాలింది. బొప్పన్‌పల్లిలో ఉల్లి పంట దెబ్బతింది. రహదారిపై చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జొన్నతో పాటు శనగ, టమాటా, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జహీరాబాద్ మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల కారణంగా చెట్లు,విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

భారీ వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌ గ్రామంలో గోడ కూలడంతో ఎస్.లచ్చయ్య అనే వ్యక్తికి చెందిన 12 గొర్రెలు చనిపోగా, మరో 15 గొర్లు తీవ్రంగా గాయపడ్డాయి. 

వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. మర్పల్లి మండలం బిల్కల్‌ గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ స్థాయిలో వడగండ్లు పడడంతో కౌలు రైతు మంగళి రమేశ్‌కు చెందిన రెండు ఎకరాల మిరప తోట పూర్తిగా దెబ్బతింది.

నిజామాబాద్‌ జిల్లో వడగండ్లు, వర్షం కారణంగా 1,812 మంది రైతులు నష్టపోయారు. నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలోని సిరికొండ మండలంలో అత్యధికంగా 506 ఎకరాల్లో, ధర్పల్లి మండలంలో 324, బోధన్‌ పరిధిలోని నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి 84 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. అలాగే సిరికొండ మండలంలో 506 ఎకరాల్లో, ధర్పల్లి మండలంలో 324, బోధన్‌ మండలంలో 42, నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి మొత్తం 884 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది.