అన్నదాతను ముంచిన అకాల వర్షం.. నేలవాలిన పత్తి, మక్క పంటలు

అన్నదాతను ముంచిన అకాల వర్షం.. నేలవాలిన పత్తి, మక్క పంటలు
  • హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తరు వానలు
  • ఈదురుగాలులకు నేలవాలిన పంటలు, విరిగిపడిన చెట్లు
  • అత్యధికంగా నిర్మల్‌‌ జిల్లాలో4.2 సెంటీమీటర్ల వాన
  • రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
  • ఇయ్యాల కూడా 17 జిల్లాలకు యెల్లో అలర్ట్‌‌ జారీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ముంచాయి. వివిధ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్ల దెబ్బకు పత్తి, మక్క, పొద్దు తిరుగుడు లాంటి పంటలు నేలవాలాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. 

సోమవారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. మబ్బులు పట్టి సాయంత్రం కాగానే పలు చోట్ల ఈదురుగాలులు వీయగా, పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్‌‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. 

నిర్మల్ జిల్లా పొంకల్‌‌లో అత్యధికంగా 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్‌‌ జిల్లా నార్నూర్, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌‌లో 3.5 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 3.4, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 2.8, ఇబ్రహీంపట్నంలో 2.6, నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌‌ చందాలో 2.6, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా జైనూరులో 2.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

ఇటు హైదరాబాద్ సిటీలోనూ మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది. హయత్‌‌నగర్‌‌, ఎల్బీనగర్, బండ్లగూడ, సెక్రటేరియట్, ఉప్పల్‌‌ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. అత్యధికంగా హస్తినాపురంలో 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బహదూర్‌‌పుర సులేమాన్‌‌ నగర్‌‌లో 1.5 సెంటీమీటర్లు, అత్తాపూర్‌‌లో 1.4, వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో 1.2, రాజేంద్రనగర్, శస్త్రీపురంలలో 1.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. 

ఇక మంగళవారం కూడా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 17 జిల్లాలకు యెల్లో అలర్ట్‌‌ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి, సంగారెడ్డి, నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 
    
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌‌ మండలం కాళేశ్వరంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గంటకు 60 నుంచి -70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలుచోట్ల పైకప్పులు ఎగిరిపోగా, భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకాగా, పలు చోట్ల విద్యుత్‌‌ అంతరాయం ఏర్పడింది. 

రైతులు కల్లాల్లో ఆరబోసిన మిరప కుప్పలు తడవకుండా కవర్లు కప్పినప్పటికీ గాలులకు అవి ఎగిరిపోవడంతో మిర్చి తడిసిపోయింది. మరో వైపు ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి సైతం తడిసిముద్దయింది. 
    
 ఆసిఫాబాద్‌‌ జిల్లా తిర్యాణి మండల కేంద్రంలో పత్తి పంట పూర్తిగా తడిసి పోయింది. ఆదిలాబాద్‌‌ జిల్లాలోని తాంసీ, ఆదిలాబాద్‌‌ రూరల్, గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, ఉట్నూర్, బజార్‌‌ హత్నూర్‌‌ మండలాల్లో వర్షం పడగా, గాలులకు చెట్లు విరిగి పడ్డాయి. గుబిడిలో పది ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. 
    
జగిత్యాల జిల్లా రాయికల్‌‌ మండలంలోని రాయికల్, అల్లీపూర్‌‌‌‌, మైతాపూర్, ఇటిక్యాల్, భూపతిపూర్ గ్రామాల్లో ఈదురుగాలులతో మామిడి పిందెలు రాలిపోయాయి.
    
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం అకాల వర్షం కురిసింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట మండలాల్లో ఈదురుగాలుల ప్రభావంతో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న నేలవాలిపోగా, దుబ్బాక మున్సిపాలిటీలోని పలు చోట్ల వడగండ్లు పడ్డాయి.