25 వస్తువులు తయారు చేస్తున్న వర్సిటీ

25 వస్తువులు తయారు చేస్తున్న వర్సిటీ

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ లోగోతో ఇప్పటి దాకా డైరీలు, క్యాలెండర్లు మాత్రమే అమ్మేవారు. తాజాగా మరికొన్ని వస్తువులను ఓయూ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జాతీయ స్థాయి సదస్సులతో పాటు ఇటీవల నిర్వహించిన గ్లోబల్​ అలుమ్ని మీట్ లో స్పెషల్​ స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించారు. ప్రస్తుతం ఓయూ లోగోతో ఉన్న టీ మగ్స్, ట్రాక్​సూట్స్, టీషర్ట్స్​వంటి మొత్తం 25 వస్తువులు అందుబాటులో ఉన్నాయి. హాట్​ అండ్​ కూల్​ వాటర్​ బాటిల్స్, ఫ్లాస్క్​లు, కీచైన్​లు, జూట్​బ్యాగులు, పెన్నులు, నోట్​బుక్స్​ అమ్ముతున్నారు. 10 నుంచి 12 రకాలు, ఐదు సైజుల్లో టీ షర్ట్స్, ట్రాక్​ సూట్లు దొరుకుతున్నాయి. ప్రతీ వస్తువు ముందు భాగంలో ఓయూ లోగో ప్రింటై ఉంటుంది. ఇవన్నీ ఆన్​లైన్​లోనే అమ్మాలని అధికారులు నిర్ణయించారు. స్టూడెంట్స్, ప్రజల నుంచి మంచి రెస్పాన్స్​ వస్తే.. వర్సిటీలో కౌంటర్​ ఏర్పాటు చేసి ప్రతీ రోజు విక్రయించాలనే ఆలోచిస్తున్నారు. 

మార్కెట్ ధరలతో పోలిస్తే కొంత ఎక్కువే..

మార్కెట్​లో దొరికే వస్తువులతో పోలిస్తే వీటి ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. టీ-షర్ట్ ధర రూ.650 నుంచి రూ.950 వరకు ఉంది. ట్రాక్ సూట్స్ రూ.1000 నుంచి రూ.1300ల దాకా ఉన్నాయి. జిప్పర్ జాకెట్ రూ.1,275, సీఎం వర్సిటీ జాకెట్ రూ.1,775, సిరామిక్ మగ్ రూ.350, ఫ్లాస్క్​ రూ.650, జ్యూట్ బ్యాగ్స్ వాటి సైజును బట్టి రూ.350 నుంచి రూ.500 దాకా ఉన్నాయి. కీచైన్ రేట్ రూ.150 వరకు ఉంది.

ఆన్​లైన్​లోనే అమ్ముతాం

ఐఐటీ, ఐఐఎం వంటి వర్సిటీల్లో చాలా రకాల వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లోగోతో కూడా కొన్ని వస్తువులు అమ్మాలని నిర్ణయించాం. వాటి తయారీ బాధ్యతలను రెండు, మూడు కంపెనీలకు ఇచ్చాం. ఓయూ లోగోతో వాటిని తయారు చేస్తారు. ఇవి ఆన్​లైన్​లోనే దొరుకుతాయి. డిమాండ్​ బాగుంటే.. ఓయూ క్యాంపస్​లోనే ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అమ్ముతాం. - ప్రొఫెసర్ పి.లక్ష్మినారాయణ, రిజిస్ట్రార్, ఉస్మానియా వర్సిటీ